ప్రకాశంజిల్లా అభివృద్ధికి అధికారులు ముందస్తు ప్రణాళికలతో కార్యక్రమాలు రూపొందించాలని, ఈ విషయంపై ఇప్పటికి రెండు సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించామని జిల్లా ఇంచార్జ్ మంత్రి విశ్వరూప్ అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా పంటల నమోదు, సాగు చేసిన పంటలకు మద్దతు ధర ఇవ్వడానికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు.
నీటి సమస్యలను పరిష్కరిస్తున్నాం
నీటి ప్రాజెక్టుల అభివృద్ధికి జిల్లాలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సమస్యలుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించి సత్వరమే పరిష్కరించేలా చూస్తున్నామని ఇంచార్జ్ మంత్రి విశ్వరూప్ అన్నారు. పశ్చిమ ప్రకాశంలో వైఎస్ఆర్ జలకళ కింద బోర్లు వేయాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
అనుమతి లేకుండా నడిపితే కఠిన చర్యలు: మంత్రి సురేష్
రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అర్హులైన వారందరికీ ఎలాంటి భేదం లేకుండా అన్ని పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
నవంబరు 2 నుంచి పాఠశాలలు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తల్లిదండ్రుల పూర్తి అనుమతితోనే పిల్లలను పాఠశాలలకు పంపాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేట్ విద్యాసంస్థలు నడిపితే... కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విద్యాకానుకలో స్కూల్ బ్యాగ్ లు నాణ్యత లోపించిందని ప్రజాప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకురాగా... తక్షణమే పరిశీలిస్తామని, బూట్లు సైజులు మార్పులు చేస్తామన్నారు. పాఠశాలల్లో విద్యార్ధులు సామాజిక దూరం పాటించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది: పోతుల సునీత
నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని శాసన, మండలి సభ్యులు పోతుల సునీత చెప్పారు. విద్యారంగంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవటంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నడపటం సంతోషదాయకమన్నారు. 'పల్స్ ఆక్సీమీటర్' పంపిణీ సంఖ్య పెంచాలన్నారు.
ఇదీ చదవండి: