ప్రకాశం జిల్లా శింగరకొండ క్షేత్రంలో నిర్వహిస్తున్న వార్షిక తిరునాళ్ల, బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ప్రసన్నాంజనేయస్వామి మూలవిరాట్‌కు అభిషేకాలు నిర్వహించి.. బంగారు ఆభరణాలతో విశేష అలంకరణ చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
కనులపండువగా రథోత్సవం..
సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. సుందరంగా అలంకరించిన రథంలో.. పూజాదికాల అనంతరం ఉత్సవ మూర్తులను ఉంచి ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వెంపరాల బృందం చెక్క భజన, కేరళ కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. అన్ని సామాజిక సత్రాల్లో హరే రామ నామ సంకీర్తన నిర్వహించారు. రథోత్సవానికి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త బాచిన కృష్ణచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సహాయ కమిషనర్ ఎన్.శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తల మండలి ఛైర్మన్ కోట శ్రీనివాసకుమార్ వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అర్చకులు శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
వేలాదిగా వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. వరుసలో నిల్చున్న వారికి ఇబ్బంది లేకుండా మంచినీరు, మజ్జిగ, చంటి పిల్లలకు పాలు వంటివి అందజేశారు. కొవిడ్ నిబంధనల అమలులో భాగంగా ఆలయ అధికారులు మాస్కులు పంపిణీ చేశారు. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నాకే ఆలయంలోకి భక్తులను అనుమతించారు.
ఇదీ చదవండి: ఇంద్రకీలాద్రిపై వైభవంగా నగరోత్సవం