ఏకైక రాజధానిగా అమరావతి(amaravati)నే కొనసాగించాలని రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం 700వ రోజుకు చేరింది. మరోవైపు రాజధాని కోసం అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర(maha padayatra) 16వ రోజుకు చేరింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన పాదయాత్ర నేడు ప్రకాశం జిల్లాలోని విక్కిరాలపేట నుంచి ప్రారంభమైంది. 10కిలో మీటర్ల మేర నడిచి కందుకూరు వరకు చేరుకొనున్నారు. అమరావతి ఉద్యమం 700వ రోజుకు చేరిన సందర్భంగా రైతులు నేడు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నారు. అవి..
- ఉ.7.30 గం.లకు అమరావతి రైతుల సర్వమత ప్రార్థనలు
- ఉ.8.15 గం.లకు అమరావతి అమరవీరులకు నివాళులు
- ఉ.8:30 గం.లకు రైతుల ప్రత్యేక నిరసన కార్యక్రమం
- ఉ.9 గం.లకు అమరావతి లక్ష్యసాధన ప్రతిజ్ఞ
- ఉ.9.30 గం.లకు దళిత మైనారిటీల అమరావతి సంకల్పం
- ఉ.10 గం.లకు మహిళల ప్రత్యేక మాలధారణ
- ఉ.10 నుంచి మ.12.30 వరకు అమరావతి ఉద్యమ గీతాల ఆలాపన
- మ.2.30 గం.లకు ఉద్యమ కాలాల్లో ముఖ్యమైన ఘట్టాలపై వ్యాఖ్యానం
- మ.3 నుంచి సా.5.30 వరకు పాదయాత్ర మార్గమధ్యలో కళ్లకు గంతలతో నిరసన
- సా.6 నుంచి రా.7 వరకు అమరావతి వెలుగు కార్యక్రమం
కృష్ణా జిల్లాలో సంఘీభావ దీక్షలు..
అమరావతి రైతులు చేస్తున్న పోరాటం 700వ రోజుకు చేరింది. మహాపాదయాత్ర(maha padayatra) చేస్తున్న రైతులకు మద్దతుగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో రైతులు పెద్ద ఎత్తున సంఘీభావ దీక్షలు చేపట్టారు. రైతు నాయకులు కర్ల నాగేశ్వరరావు, సుధీర్ బాబు ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. రైతుల మహా పాదయాత్ర పూర్తయ్యే వరకు తమ దీక్షలు కొనసాగిస్తామని రైతులు తెలిపారు.
సర్వమత ప్రార్థనలు
అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రకాశం జిల్లాలో పదోవ రోజు ప్రారంభమైంది. రాజధాని ఉద్యమం ప్రారంభమై నేటికి 700 రోజులు పూర్తైన సందర్భంగా పాదయాత్రలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విక్కిరాలపేట గ్రామంలో రైతులు బస చేసిన ప్రాంతం వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అమరావతి రైతుల పోరాటంలో విజయం సాధించాలని మతపెద్దలు ఆశ్వీరచనాలు పలికారు. ఈ కార్యక్రమంలో అమరావతి రైతులతోపాటు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజధానిగా అమరావతిని సాధించే వరకు విశ్రమించేది లేదని రైతులు ప్రతిజ్ఙ చేశారు. పాదయాత్రలో కళ బృందాలు.. అమరావతి చైతన్య గీతాలు అలపించారు.
పాదయాత్రలో పాల్గొన్న తెనాలి శ్రావణ్ కుమార్
విక్కిరాలపాడు గ్రామం నుంచి 16వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. వెంకటేశ్వరస్వామి రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులు పాదయాత్ర ప్రారంభించారు. ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి రైతుల పాదయాత్రలో పాల్గొంటున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ నేడు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసైన.. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి విషయంలో అవాస్తవాలు చెబుతూ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.
సోమవారం ఇలా సాగింది..
అమరావతి రైతుల మహాపాదయాత్ర 15వ రోజైన సోమవారం ఉదయం ప్రకాశం జిల్లాలో ఎం.నిడమనూరులో ప్రారంభమై, కె.ఉప్పలపాడు, చిర్రికూరపాడు మీదుగా 15 కిలోమీటర్లు సాగి సాయంత్రం కందుకూరు మండలం విక్కిరాలపేటలో ముగిసింది. రెండురోజులుగా కురిసిన వర్షానికి ఎం.నిడమలూరు నుంచి ఉప్పలపాడు వరకు ఉన్న రోడ్డు బురదమయమైంది. ఆ బురదలోనే మూడు కిలోమీటర్లు పాదయాత్ర ముందుకు సాగింది. ఉప్పలపాడు నుంచి చిర్రికూరపాడు వరకు ఏడు కిలోమీటర్లు మధ్యలో ఎక్కడా గ్రామాలు లేకపోయినా కట్టుబడిపాలెం, జరుగుమల్లి మండలాల ప్రజలు వచ్చి సంఘీభావం తెలిపారు. చిర్రికూరపాడుకు చెందిన 30 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఏడు కిలోమీటర్ల పొడవునా ‘రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతే. రైతుల త్యాగాలు వృథాకావు’ వంటి నినాదాలతో తోరణాలు కట్టారు. పాలేరు వంతెనకు ఇరువైపులా పూలు, అరటిచెట్లు, బెలూన్లతో అలంకరించారు. పాదయాత్రికులతో పొగాకు రైతులు, కూలీలు మాట్లాడుతూ... ‘మీ కష్టం ఊరికే పోదు. మీరు బయటకు వచ్చి ఇబ్బందులపై పోరాటం చేస్తున్నారు. మేం పంటలు పండక, గిట్టుబాటు లేక, చేసిన కష్టమూ మిగలక అగచాట్లు పడుతున్నాం’ అని ఆవేదన పంచుకున్నారు.
హీలియం గ్యాస్ సిలిండర్ పేలి ఒకరి మృతి
పాదయాత్రలో సోమవారం అపశ్రుతి చోటుచేసుకుంది. జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు సమీపంలో హీలియం సిలిండర్ పేలి ఒకరు మృతిచెందారు. బెలూన్లకు గ్యాస్ నింపే హీలియం సిలిండర్‌ను ఆటోకు అమర్చారు. పాలేరు వంతెన వద్ద గ్యాస్ నింపుతుండగా సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దాంతో విజయవాడ కృష్ణలంకకు చెందిన విన్నకపోట రాఘవేంద్రరావు(60), మేడా నవీన్(21), షకలాబత్తుల భాస్కరరావుకు గాయాలయ్యాయి. బాధితులను ఒంగోలు రిమ్స్‌కు తరలించగా... చికిత్స పొందుతూ రాఘవేంద్రరావు మృతిచెందారు. సంఘటనా స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ నాగరాజు పరిశీలించారు.
ఇదీ చదవండి