కృష్ణా జిల్లా విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించిన 'బీసీ సంక్రాంతి' సభకు వెళ్లి ఓ వ్యక్తి మరణించాడు. మృతుడు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామానికి చెందిన బ్రహ్మయ్య అనే వాలంటీర్‌గా గుర్తించారు.
'బీసీల సంక్రాంతి' కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలోని గొట్టిపడియ గ్రామం నుంచి సుమారు 50 మంది వెళ్లారు. ప్రమాణ స్వీకారం అనంతరం అందరూ కలిసి భోజనం చేసే సమయంలో బ్రహ్మయ్య అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకులాడు. అతన్ని హుటాహుటిన సమీపంలోని వైద్యశాలకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
దాచే ప్రయత్నం
ప్రభుత్వం నిర్వహించిన బీసీ సభలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఎవరు మాయం చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు నిలదీశారు. ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవో ఎన్ఆర్ఐ ఆస్పత్రికి ఫోన్ చేసిన వెంటనే శవం కనిపించకుండా పోయిందని ఆరోపించారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేరిన బాధితుల వివరాలను బయటపెట్టాలన్నారు. ప్రభుత్వ తప్పిదానికి నిండు ప్రాణం బలైపోయిందని... ఘటనను ఎందుకు దాచే ప్రయత్నం చేస్తున్నారని కాలువ ప్రశ్నించారు.
ప్రభుత్వ హత్యే
'బీసీ సంక్రాంతి' సభలో విషాహారం వల్లే యువకుడు మృతి చెందాడని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుల పరామర్శకు కూడా వైకాపా నేతలు వెళ్లకపోవటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.
ఇదీ చదవండి