FERRO INDUSTRY : నెల్లూరు జిల్లాలో దాదాపు లక్ష జనాభా ఉన్న ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ధరణి ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మున్సిపాలిటీ చుట్టుపక్కల వెంకట్రావుపల్లి, నరసాపురం, జాలయ్య నగరం, ముస్తాపురం, కుప్పురుపాడు గ్రామాలు ఉన్నాయి. వీటి మధ్యలో ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమకు 3.56ఎకరాలు కేటాయించారు . ప్రజాభిప్రాయం తీసుకోకుండానే అనుమతులు ఇచ్చారు. పనులు కూడా 30శాతం పూర్తి చేశారు.
పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యంతో చుట్టు పక్కల గ్రామాల్లోని జనం అనారోగ్యాల బారిన పడతామని ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమకు కిలోమీటరు లోపే ఈ గ్రామాలు ఉన్నాయి. కాలుష్య నియంత్రణకు పది వేల మొక్కలు నాటుతామని అధికారులు చెబుతున్నా.. అందుకు సరిపడా భూమి కేటాయించలేదు. ఈ పరిశ్రమ నుంచి 9 వేల 360 టన్నుల వ్యర్ధాలు వస్తాయని అంచనా. వాటిని నిల్వ చేయడానికి పరిశ్రమకు ఇచ్చిన స్థలం చాలదని.. తమ గ్రామాలు డంపింగ్ యార్డుల్లా మారతాయని స్థానికులు భయపడుతున్నారు.
"ఈ ఫ్యాక్టరీ వల్ల విషవాయువులు వెలువడుతాయి. దాని వల్ల మేమందంరం అనారోగ్యానికి గురవుతాయి. ఇది ఊరు మొత్తానికి ప్రమాదకరంగా మారుతుంది. పరిశ్రమ పెడుతున్నట్లు మాకు ఎటువంటి సమాచారం లేదు. పరిశ్రమ వస్తే ఐదు గ్రామాల ప్రజలందరూ తీవ్ర అనారోగ్య సమస్యలకు గురై.. అనేక ఇబ్బందులు పడతారు. ఎటువంటి పరిస్థితులలో పరిశ్రమ ఏర్పాటుకు మేము అంగీకరించం. పరిశ్రమ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయకపోతే ఎంత వరకైనా పోరాటం చేస్తాము"-గ్రామస్థులు
గతంలో పరిశ్రమ పనులు మొదలైనా స్థానికులు నిరసనలతో తాత్కాలికంగా ఆగిపోయాయి. 30శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. చుట్టూ పొలాలు ఉన్నాయని.. గొర్రెలు, మేకలు, పాడి గేదెల మేతకు పనికి వచ్చే భూమి కాలుష్యం కారణంగా పాడైతే.. తమ జీవనోపాధి దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమకు సమీపంలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల, ప్రభుత్వ బాలుర ఇంటిగ్రేటెడ్ వసతి గృహం ఉన్నాయి. వీటిలో 2వేల మంది విద్యార్ధులు చదువుతున్నారు. పరిశ్రమ కాలుష్యం విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని స్థానికులు వాపోతున్నారు.
ధరణి ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని.. కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తమ గ్రామాలకు వచ్చి అభిప్రాయాలు సేకరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: