నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మందు(Anandayya medicine)పై పరిశోధన పురోగతి గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఫోన్ చేశారు. పరిశోధన పురోగతి గురించి ఉపరాష్ట్రపతికి కేంద్రమంత్రి వివరించారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) ఆధ్వర్యంలో, ఏపీ ఆయుష్ విభాగం సహకారంతో ఆనందయ్య మందు(Anandayya medicine)ను ఇప్పటికే వాడిన 500 మంది నుంచి వివరాలు సేకరించి, పరిశోధన జరుపుతున్నామని, వీలైనంత త్వరలోనే పరిశోధన పూర్తిచేసి నివేదిక సిద్ధం చేస్తామని చెప్పారు.
వివాదాలకు తావు లేకుండా అన్ని కోణాల నుంచి పరిశోధన చేయాల్సి ఉంటుందని, అందువల్ల కాస్త సమయం పడుతోందని ఉపరాష్ట్రపతికి వివరించారు. ఈ విషయంపై రాజీ పడకుండా, వీలైనంత త్వరగా పరిశోధనను పూర్తి చేస్తామని ఉపరాష్ట్రపతికి కేంద్రమంత్రి వివరించారు. అనంతరం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొ.బలరాంభార్గవ్ తోనూ ఉపరాష్ట్రపతి ఫోన్లో మాట్లాడారు. ఈ మందు ఆయుష్ విభాగ పరిధిలోనిదని, ఇప్పటికే ఆయుష్ వారి పరిశోధన ప్రారంభమై, కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ అదనంగా ఐసీఎంఆర్ విచారణ అవసరం లేదని ఆయన ఉపరాష్ట్రపతికి తెలియజేశారు.
ఇదీ చదవండీ... TTD-Hanuman birth place: అసంపూర్తిగా ముగిసిన హనుమాన్ జన్మస్థలంపై చర్చ