నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 24 గంటల వ్యవధిలో ఓ ఇంట్లో ఇద్దరు చనిపోయిన ఘటన విషాదాన్ని నింపింది. వెంకటగిరిలో నివాసం ఉంటున్న బాలాయపల్లి మండలం మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ చెరుకూరి రామచంద్రయ్య భార్య పద్మజ (58) సోమవారం మరణించింది. ఆయన కుమారుడు సురేష్ (35) కరోనాతో నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందట ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి ఆరోగ్య పరిస్థతిపై ఆందోళనతోనే పద్మజ అస్వస్థత చెందినట్లు బంధువుల సమాచారం. ఆమెను వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లే ప్రయత్నంలో చనిపోవడంతో ఈ ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. సాయంత్రం మళ్లీ ఈ ఇంట్లో కొడుకు మృతి వార్త కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది.
సురేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు. బిటెక్ చేసిన ఆయన నాయుడుపేటలోని ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. బాలాయపల్లి మండలం జయంపు వీరి స్వగ్రామం. రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి జనార్ధనరెడ్డి ఆశీస్సులతో ఒక సారి బాలాయపల్లి మండలాధ్యక్షులుగా, మరో సారి బీసీ కోటాలో జెడ్పీటీసీ గా వ్యవహరించాడు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ ట్యాంకర్ 5 నిమిషాలు ఆలస్యం.. 11 మంది కొవిడ్ రోగులు మరణం