- కొవిడ్‌తో బాధపడుతూ ఓ వ్యక్తి ఏప్రిల్ 24న నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను పరిశీలించిన వైద్యులు.. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు వేయాలని సిఫార్సు చేశారు. దాంతో అక్కడి సిబ్బంది 25, 26 తేదీల్లో రెండు ఇంజక్షన్లు వేశారు. ఆ తర్వాత బాధితుడు మెరుగైన చికిత్స కోసం అదే నెల 27న ఆ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయి మరో ఆసుపత్రికి వెళ్లారు. కానీ, 28వ తేదీ... ముందు చికిత్స తీసుకున్న ఆసుపత్రిలో రెమ్‌డెసివిర్ డోసు తీసుకున్నట్లు చరవాణికి సంక్షిప్త సమాచారం అందింది. ఆ వెంటనే అతడి ఆరోగ్యం నిలకడగా లేదంటూ మరో సంక్షిప్త సందేశం రావడంతో నివ్వెరపోవడం బాధితుడి వంతైంది.
- కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చేరి పది రోజులైనా.. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇంట్లో వారికి ఫోన్ చేసి మొరపెట్టుకున్నారు. తనను అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని, అక్కడ సరైన వైద్యం అందడం లేదని వాపోయారు. ఆ విషయం తెలుసుకున్న ఆయన బంధువు.. తెలిసిన వారి ద్వారా ఆసుపత్రి నోడల్ అధికారితో మాట్లాడితే... సదరు బాధితుడి శాచ్యురేషన్ 95 శాతం ఉందని, నాలుగు రోజులుగా రెమ్‌డెసివిర్ వేస్తున్నట్లు తెలపడంతో బాధితుడితో పాటు వారి కుటుంబ సభ్యులుఅవాక్కయ్యారు.
కొవిడ్ అత్యవసర చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు కొందరు అక్రమార్కులు కృత్రిమ కొరత సృష్టిస్తుంటే.. మరికొందరు పక్కదారి పట్టిస్తున్నారు. బాధితులు త్వరగా కోలుకోవడానికి ఇవ్వాల్సిన ఇంజక్షన్లను.. వారికి ఇవ్వకుండా నల్ల బజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా జిల్లాలో యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు నెలకొన్నాయి. రెమ్ డెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు, ప్రజలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరతోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కొవిడ్ చికిత్స అందించే ఆసుపత్రులు ఇండెంట్ పెట్టుకుంటే జిల్లా యంత్రాంగమే సరఫరా చేస్తోంది.
ఈ క్రమంలో కొందరు.. అవసరం లేకపోయినా.. ఏదో బాధితుడి పేరుతో ఇంజక్షన్లు తెప్పించడం.. ఒక్కో వ్యక్తి పేరున ఆరు ఇంజక్షన్లు తీసుకొచ్ఛి. కొన్ని వాడిన తర్వాత.. మిగిలినవి లెక్క చూపకుండా పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత నెలలో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేయగా... బాధితుల నుంచి అధిక సొమ్ము వసూలు చేయడంతో పాటు రెమ్‌డెసివిర్‌ను ఇంజక్షన్లను పక్కదారి పట్టించినట్లు తేలింది. సుమారు 30 ఇంజక్షన్లకు సంబంధించిన లెక్కలు తేలకపోవడంతో అధికారులు.. సదరు ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు. ఇంకో ఆసుపత్రికి చెందిన వ్యక్తి నల్లబజారులో ఈ ఇంజక్షన్లను విక్రయిస్తుండగా.. విజిలెన్స్ అధికారులు పక్కా సమాచారంతో వలపన్ని పట్టుకున్నారు. కొవిడ్ సమయంలో నిబద్ధతతో సేవలందిస్తున్న వైద్యులు.. సిబ్బంది ఒక వైపు ఉండగా.. ఇలా అడ్డంగా జనం నుంచి దోపిడీ చేస్తున్న వాళ్లు ఇంకోవైపు పెరిగిపోవడం విస్తుగొలుపుతోంది. విమర్శలకు తావిస్తోంది.
అవసరాన్ని బట్టి ధరలు..
నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రులు, హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న ఎంతో మందికి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు వేయించుకోవాలంటూ నిత్యం వైద్యులు సూచిస్తూనే ఉన్నారు. కానీ, అవి ఎక్కడ దొరుకుతాయో అవగాహన ఉండటం లేదు. దాంతో కనిపించిన వారినందరినీ అడుగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వాళ్లందరికీ ఇంజక్షన్లు అందించే పరిస్థితిలో అధికారులు లేరు. కనీసం ఎక్కడ దొరుకుతుందనే సమాచారాన్ని అయినా ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కానీ, ఆ సమస్య ఉందనే విషయం కూడా తమకు తెలియదన్నట్లుగా జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారు. అందుకే అక్రమార్కులు విచ్చలవిడిగా దందాను నడిపిస్తున్నారు. పరిస్థితిని బట్టి.. ఒక్కో ఇంజక్షన్‌ను రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు అమ్ముతున్నట్లు కొందరు బాధితులు వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.
అలా చెప్ఫి... ఆఖరికి...!
కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులను సిబ్బందే తప్పుదోవ పట్టించి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు తెచ్చుకోవాలని సూచించడం.. ఆ తర్వాత.. అవసరమైతే వాటిని వినియోగిస్తామంటూ దాచి ఉంచడం జరుగుతోంది. ఆ క్రమంలో ఉండగా.. కొందరు కోలుకుని వెళ్లడం.. మరికొందరు చనిపోవడం జరుగుతుండగా.. వారికి సంబంధించిన ఇంజక్షన్లను సిబ్బంది తమ వద్దే ఉంచుకుని నల్లబజారులో విక్రయిస్తున్నారు. ఇదంతా ఒక వైపు కాగా.. జిల్లాలో కొవిడ్ సేవలు అందిస్తున్న అన్ని ఆసుపత్రుల్లో దాదాపు అత్యవసర పడకలన్నీ నిండిపోతున్నాయి. ఈ క్రమంలో అవసరమైన వారికి వైద్యుల సూచనతో ఒక్కో మనిషికి ఆరు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు తెప్పిస్తున్నారు.
ఆ తర్వాత రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి డిశ్ఛార్జి అయినా.. విషమించి చనిపోయినా.. మిగతా వాటికి లెక్కలు ఉండటం లేదు. పైగా డిశ్ఛార్జి అయిన, చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యుల చరవాణులకు ఇంకా ఆ ఇంజక్షన్లు వాడుతున్నట్లు సంక్షిప్త సమాచారం వస్తోంది. దీంతో పాటు ఓ సారి అతడి ఆరోగ్యం బాగుందని, మరోసారి నిలకడగా లేదని సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు. ఈ విధంగా లెక్కల్లోకి రాని ఇంజక్షన్లను ఏదో ఒక చిన్న ఆసుపత్రికి తొలుత చేర్ఛి. అక్కడి నుంచి స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ, కిందిస్థాయి వైద్య సిబ్బంది సహకారంతో పెద్ద ఆసుపత్రులను సంప్రదిస్తున్నారు. అక్కడి వారి సహకారంతో రెమ్‌డెసివిర్ అవసరమైన బాధితుల బంధువులతో బేరాలు సాగిస్తున్నారు. ఈ దందా చాపకింద నీరులా సాగిపోతోంది.
వివరాలు తెప్పించి.. లెక్కలు తేలుస్తాం...
రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు పక్కదారి పట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం గుర్తించిన కొవిడ్ ఆసుపత్రులు తమకు అవసరమైన మేరకు ఇండెంట్ పెట్టుకుంటేనే సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలు పక్కాగా సమర్పించాలని కోరుతున్నాం. ఈ ఇంజక్షన్లకు సంబంధించి ప్రిస్కిప్షన్లు రాసి బయటకు పంపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాయి. ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితులకు వినియోగిస్తున్న ఇంజక్షన్ల వివరాలు తెప్పించి.. ఎవరికెన్ని వాడారో పరిశీలిస్తాం. దుర్వినియోగం చేశారని నిర్ధారణ జరిగితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటాం. - వీర కుమార్‌రెడ్డి, ఔషధ నియంత్రణ అధికారి
ఇదీ చదవండి: