పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన షేక్ గౌస్ బాష హాబీబీ దంపతుల రెండో సంతానం షేక్ జాస్మిన్. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేది. తన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. పదో తరగతిలో 90 శాతంతో ఉత్తీర్ణత సాధించి... కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సీటు పొందింది. తన ప్రతిభతో క్యాంపస్ సెలక్షన్స్ లో బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం సాధించింది.
బిజికేస్ సంస్థ
ఏదో సాధించాలన్న తపన, పట్టుదలతో జాస్మిన్ తన ప్రయాణం ప్రారంభించింది. ఉద్యోగం వదిలేసి...తల్లిదండ్రులు, మిత్రులు సహకారంతో అతి చిన్న వయసులోనే బిజికేస్ అనే సాఫ్ట్ వేర్ సంస్థను స్థాపించింది. ఈ సంస్థను పూణె, కోల్ కతా వంటి మహా నగరాలకు విస్తరించింది. పట్టుదలే పెట్టుబడిగా స్వయంకృషితో ఎదిగిన జాస్మిన్ కు.. ఇంకా ఏదో సాధించాలనే తపన మాత్రం పోలేదు. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు జాస్మిన్ ను కొత్త మార్గంవైపు నడిపాయి.
ఈ కామర్స్ యాప్ రూపకల్పన
వినియోగదారులు, చిరు వ్యాపారులను అనుసంధానించేలా ఓ న్యూట్రీ అంకుల్ అనే ఈ కామర్స్ యాప్ ను రూపొందించింది జాస్మిన్. పల్లెలు, పట్టణాల్లో పది కిలోమీటర్ల విస్తీర్ణంలోని చిరు వ్యాపారులకు ప్రజలకు మధ్య వారధిలా ఈ యాప్ ఉపయోగపడుతోందని చెబుతున్నారు జాస్మిన్.
స్వయంకృషితో ఎదిగిన జాస్మిన్.. ప్రజలకు అవసరమైన నూతన యాప్ లను సృష్టించడం చాలా ఆనందించే విషయమని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు.
ఇదీ చదవండి : జగన్‌రెడ్డి రాజ్యంలో దళితులకు జీవించే హక్కులేదా..?: లోకేశ్