Lokesh Yuvagalam Padayatra: నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర జగన్‌కి భయాన్ని పరిచయం చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. నెల్లూరులో 146వ రోజు యువగళం పాదయాత్ర సందర్భంగా వీఆర్సీ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ క్రమంలో అధికార పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనం.. జనం.. జనం.. ప్రభంజనం, సింహపురిలో సింహ గర్జన అదిరిపోయిందని అన్నారు. హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ వివేకా? పిన్ని తాళి తెంచింది ఎవరు? అబ్బాయ్ కిల్డ్ బాబాయ్. పిన్ని తాళి తెంచింది జగనే. బాబాయ్ మర్డర్ ఎవరి రక్త చరిత్ర అని లోకేశ్ ప్రశ్నించారు.
జగన్‌కు 'గంజాయి బ్రో' అని ముద్దుగా పేరు పెట్టా అని అన్న లోకేశ్.. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్ అని మండిపడ్డారు. ఒక్క నెల్లూరు టౌన్లోనే 17 వేల టిడ్కో ఇళ్లు కట్టామని.. సీసీ రోడ్లు, తాగునీటి పథకాలు, పార్కులు, ఎల్ఈడి లైట్లు, అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసామన్నారు. నారాయణ అభివృద్ధిలో మాస్టర్ అని.. నారాయణ ఎక్కడ ఆపేశారో అక్కడ నుంచి నెల్లూరు అభివృద్ధి మళ్లీ రీస్టార్ట్ చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు, టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందిస్తామన్నారు. నెల్లూరు టౌన్లో స్వర్ణకారులు పడుతున్న కష్టాలు తనకు తెలుసని.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్వర్ణకారులను ఆదుకుంటామన్నారు. అలాగే అనిల్ అక్రమార్జన విలువ రూ.వెయ్యి కోట్లని ఆరోపించారు. నెల్లూరు జిల్లాని వైఎస్సార్సీపీ నేతలు నాశనం చేశారని.. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేశారని ఆగ్రహించారు.
కాగా, నెల్లూరు గ్రామీణ, నగర నియోజకవర్గంలో టీడీపీ అభిమానులు.. యువనేత నారా లోకేశ్‌తో నగర వీధుల్లో నడిచారు. యువగళం పాదయాత్ర జన ప్రభంజనాన్ని తలపించింది. మహిళలు, యువకులు భవనాలపై నిలబడి యువనేతకు అభివాదం చేశారు. విచిత్ర వేషధారణలు, డప్పు శబ్దాలు, బాణసంచా మోతలతో సింహపురి మారుమోగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు నగర ఇన్ ఛార్జి పొంగూరి నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో వేలాది కార్యకర్తలు.. యువనేతకు బ్రహ్మరథం పట్టారు. భారీ బహిరంగ సభకు నగరం నలుమూలల నుంచి జనం పోటెత్తారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, జై లోకేశ్ నినాదాలతో నెల్లూరు నగరవీధులు మారుమోగాయి. అడుగడుగునా అభిమానులు యువనేతపై పూలవర్షం కురిపించారు. భారీ గజమాలలు, హారతులు, గుమ్మడికాయలతో యువనేతకు దిష్టితీస్తూ మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతకముందు నెల్లూరు కనకమహాలక్ష్మి సెంటర్లో స్వర్ణకారులు.. యువనేత లోకేశ్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
నేటి పాదయాత్ర ఇలా..: బుధవారం మధ్యాహ్నం కోవూరు నియోజకవర్గం సాలుచింతల విడిది కేంద్రం వద్ద వ్యాపారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు సాలుచింతలలో పాదయాత్ర 1900కి.మీ పూర్తయిన సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ. అక్కడి నుంచి స్టౌవ్‌బీడీ కాలనీ, పడుగుపాడు, కోవూరు బజారు, మండబైలు, గుమ్మలదిబ్బ, పాతూరు, దామరమడుగు, ఆర్.ఆర్.నగర్, కాగులపాడు, రేబాల కూడలి మీదుగా రాత్రి 9 గంటలకు చెల్లాయపాళెంలోని విడిది కేంద్రం దగ్గరకు చేరుకుంటుంది.