Loan app harassments: ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు ఆగడం లేదు. లోన్ యాప్ ద్వారా రూ.30 వేల రుణం తీసుకుంటే రూ.40 లక్షలు వసూలు చేసిన యాప్ నిర్వాహకులు.. ఇంకా నగదు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో నెల్లూరుకు చెందిన ఓ బాధితుడు పోలీసులు ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన బాలాజీనగర్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. లోన్ యాప్ ఆగడాలపై జిల్లా ఎస్పీ విజయరావు మీడియాకు వివరాలు వెల్లడించారు.
నెల్లూరు ఆదిత్యనగర్‌కు చెందిన విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి.. లోన్ యాప్ ద్వారా రూ.30 వేలు రుణం తీసుకున్నాడు. రుణ మొత్తం సకాలంలో చెల్లించలేదని, మీ ఫొటోలు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతామంటూ యాప్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడ్డారు. పరువు పోతుందని భావించిన బాధితుడి యాప్ నిర్వాహలకు రూ.40 లక్షల వరకు చెల్లించాడు. ఇంకా బాధితుడిని బెదిరిస్తూ ఇంకా నగదు కట్టాలని ఒత్తిడి చేస్తుండటంతో అతడు పోలీసులను ఆశ్రయించారు.
కేసు విచారించిన పోలీసులు.. తెలంగాణకు చెందిన యువరాజు, అజయ్ పవన్ కల్యాణ్, రాథోడ్ సాయి కిరణ్, కర్ణాటకకు చెందిన అబ్దుల్‌లను అరెస్ట్ చేశారు. హాంకాంగ్‌కు చెందిన లీసా అనే మహిళ ద్వారా ఈ మోసానికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. వివిధ రాష్ట్రాల్లోని యాప్ నిర్వాహకుల బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి, కోట్ల రూపాయల నగదును పోలీసులు హోల్డ్ చేయించారు. ఈ కేసును లోతుగా విచారించి, మరికొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. యాప్ నిర్వాహకుల మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులను అభినందించారు.
ఇవీ చదవండి: