నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో జి.మాల్యాద్రి, వేణు భగవాన్.. ఇటుక తయారీ పరిశ్రమ నడుపుతున్నారు. నెల రోజుల కిందట ఒడిశా రాష్ట్రం బోలంగిరి జిల్లా పట్నాగర్ తాలుకా దుంగ్రాబహల్ గ్రామానికి చెందిన 15 మంది కార్మికులు ఇక్కడికి వచ్చారు. కొన్నిరోజుల తర్వాత నలుగురు కూలీలు చెప్పకుండా వెళ్లిపోయారు. ఆగ్రహించిన యజమానులు ఆడమగ తేడా లేకుండా అసభ్యంగా దూషిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని.. తమను రక్షించాలంటూ ఒడిశా లీగల్ అథారిటీ అధికారులకు బాధితులు విన్నవించారు.
వారు నెల్లూరు జిల్లా లీగల్ అథారిటీ అధికారులకు సమాచారాన్ని చేరవేయడంతో కావలి సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీస్ కమిటీ అథారిటీ ఛైర్మన్ పాండురంగారెడ్డి వలస కూలీలను కలిశారు. రోజువారీ కూలి కూడా సక్రమంగా ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపించారు. ప్రస్తుతం పనులు లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన జడ్జి.. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకునేలా కార్మిక, పోలీసుశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇబ్బందులకు గురిచేసే పరిశ్రమల యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
'పనికోసం వచ్చిన వారిలో కొందరు తిరిగి వెళ్లారన్న కోపంతో.. ఉన్న మమ్మల్ని క్రూరంగా కొట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. మమ్మల్ని రక్షించండి సారూ’... అంటూ వేడుకున్నారు.
ఇదీ చదవండి: