Fevers In Nellore: నెల్లూరుకు 30కిలోమీటర్ల దూరంలోని పాత వెల్లింటి గ్రామంలో ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు జ్వరాలతో సతమతవుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. చాలా మంది నెల్లూరు వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ప్రస్తుతం మరో 40మందికి పైగా స్థానికులు గ్రామంలో జ్వరాలతో అల్లాడుతున్నారు. జ్వరపీడితుల సంఖ్య తగ్గకపోవడంపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది. డెంగీ జ్వరాలేమోనని భయపడుతున్నారు. ఒళ్లు నొప్పులతో కదల్లేకపోతున్నామని నీరసంగా ఉంటోందని బాధితులు వాపోతున్నారు.
గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్ల ఇళ్ల మధ్యలో మురుగు నిలిచి దోమలు వ్యాపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. దీనికి తోడు దుర్గంధం భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విష జ్వరాలతో ఇప్పటికే ముగ్గురు చనిపోయారని తెలిపారు. వైద్యాధికారులు మాత్రం గ్రామంలో డెంగీ జ్వరాలు లేవని చెబుతున్నారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టామంటున్న అధికారులు.. త్వరలో జ్వరపీడితుల సంఖ్య తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
"గ్రామంలో ప్రజలకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సూచిస్తున్నాము. జ్వరాలు తగ్గేంత వరకు ఆరోగ్య సిబ్బందితో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నాం. ఇంకా వారం రోజుల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తాం". -హుసేనమ్మ, వైద్యాధికారిణి
ఇవీ చదవండి: