Damodaram Sanjivaiah Thermal Power Station: రాష్ట్రంలో మరో థర్మల్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం మూడో యూనిట్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. థర్మల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులను అభినందించిన సీఎం... నిర్వాసితుల కుటుంబాలకు నవంబర్‌లోగా ఉద్యోగాలిస్తామన్నారు.
నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు అడిగిన హామీలకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. 25 కోట్లతో మిని ఫిషింగ్ హార్బర్ పనులు చేపడుతున్నామన్నారు. పెన్నా నదిపై ముదివర్తి వద్ద 93 కోట్ల రూపాయలతో సబ్ మెర్సబుల్ కాజ్ వే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు బ్యారేజ్ కు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. ఉప్పు కాలువ పై హైలెవెల్ బ్రిడ్జిని మంజూరు చేస్తున్నామని.. నక్కల వాగుపై 10కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
" థర్మల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు. నిర్వాసితుల కుటుంబాలకు నవంబర్‌లోగా ఉద్యోగాలిస్తాం. రూ.25 కోట్లతో మిని ఫిషింగ్ హార్బర్ పనులు చేపడుతున్నాం. పెన్నా నదిపై ముదివర్తి వద్ద 93 కోట్ల రూపాయలతో సబ్ మెర్సబుల్ కాజ్ వే నిర్మిస్తాం. నెల్లూరు బ్యారేజ్ కు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెడుతున్నాం. ఉప్పు కాలువ పై హైలెవెల్ బ్రిడ్జిని మంజూరు చేస్తున్నాం నక్కల వాగుపై 10కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తాం." -సీఎం జగన్
సీఎం పర్యటన దృష్ట్యా ఉదయం నుంచే పోలీసులు థర్మల్ విద్యుత్ ప్లాంటు పరిరక్షణ కమిటీ నాయకులను, ఐకాస నాయకులను అరెస్టు చేశారు. సీఎం సభను అడ్డుకుంటామని పిలుపు ఇచ్చినందువల్ల వారిని నెల్లూరులోనే అడ్డుకున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు నెల్లూరు నగరంలో ప్రదర్శనలు నిర్వహించారు. నల్ల బెలూన్ గాలిలోకి వదిలారు. నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు సీపీఎం, సీపీఐ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
ఇవీ చదవండి: