నెల్లూరు జిల్లా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న(chandrababu nellor tour news) చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెళ్లకూరు, నాయుడుపేట, గూడూరు, వెంకటాచలం వద్ద ఆగి శ్రేణులతో కాసేపు మాట్లాడారు. మద్యపాన నిషేధమని చెప్పిన సీఎం జగన్.. తాగిన డబ్బుతో వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు ఇవ్వటమేంటని ప్రశ్నించారు.
నాన్న తాగితే పిల్లలకు అమ్మఒడి, మీరు తాగితే మీ పిల్లలకి చదువు అని కొత్త కొత్త స్కీములు పెట్టే విచిత్రమైన మనిషి జగన్ అని ఎద్దేవా చేశారు. వైకాపా పాలనలో కొత్త కష్టాలు ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం కావాలన్నారు. పేదవాడి రక్తాన్ని తాగే జలగ వైకాపా అని ధ్వజమెత్తారు. తాను ప్రజల కోసం ఉన్నానని.. బెదిరింపులకు భయపడబోనని తేల్చిచెప్పారు.
"నాన్న తాగితేనే అమ్మ ఒడి ఇస్తాననడం దుర్మార్గం. తాగిన డబ్బుతో ఇచ్చే సంక్షేమ పథకాలు ఎవరడిగారు. పేదల రక్తంతో ఇచ్చే సంక్షేమ పథకాలు మనకు అవసరమా ? కొత్త స్కీములు పెట్టే విచిత్రమైన మనిషి జగన్ రెడ్డి. నేను ప్రజల కోసమే ఉన్నా.. బెదిరింపులకు భయపడను." -చంద్రబాబు, తెదేపా అధినేత
వారి మరణానికి ప్రభుత్వమే కారణం
వరద ప్రభావిత ప్రాంతాలైన ఇందుకూరుపేట, రేవూరులో పర్యటించిన చంద్రబాబు..దెబ్బతిన్న ఆక్వా చెరువులు, పొలాల్ని పరిశీలించారు. జిల్లాలో ఇసుకను బెంగళూరు, చెన్నైలకు తరలించి కట్టల్ని బలహీనపరిచారని ప్రభుత్వంపై మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాఫియాగా ఏర్పడి ఇసుకను దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఇసుక తవ్వకాల కోసమే నీటిని సకాలంలో వదలకుండా ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో మామూలు పరిస్థితులు లేవన్న చంద్రబాబు..ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తుంటే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. వరదలు వస్తే గతంలో ఎప్పుడూ 60 మంది చనిపోలేదన్న ఆయన.. వారి మరణానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు.
అక్రమ కేసులు పెట్టే పోలీసులపై ప్రత్యేక కమిషన్
పంటలకు గిట్టుబాటు ధర లభించట్లేదని రైతులు చంద్రబాబుకు(chandrababu naidu nellore tour) వివరించారు. ఇంటి రిజిస్ట్రేషన్లకు ఇప్పుడు కొత్తగా రూ.10 వేలు కట్టమంటున్నారని వాపోయారు. సమస్యలపై మంత్రుల్ని ప్రశ్నిస్తే..పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు భరోసా ఇచ్చిన చంద్రబాబు..ఇంటి రిజిస్ట్రేషన్‌కు ఎవ్వరూ డబ్బు కట్టొద్దన్నారు. ఈ అంశంపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే దీనిని రద్దు చేస్తామన్నారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులపై ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసి వారికి శిక్షపడేలా చూస్తామన్నారు.
బాధితులకు ఆర్థిక సాయం
గంగపట్నంలో ముంపు బాధితులను పరామర్శించిన చంద్రబాబు..బాధితుల ఇళ్లలోకి వెళ్లి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. వరదలకు ఇళ్లు బురదమయం అయ్యాయని మహిళలు చంద్రబాబు ఎదుట విలపించారు. వైకాపాకు ఓట్లేసి మోసపోయామని.., ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఓ రైతు చంద్రబాబు కాళ్లపై పడి ఆవేదన వ్యక్తం చేశారు. గంగపట్నం బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కుటుంబానికి రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ముంపు నుంచి ఇద్దరిని కాపాడిన సురేశ్ అనే వ్యక్తికి నగదు ప్రోత్సాహం అందించారు. ఆక్వా రంగం కోలుకునే వరకు బాధితులకు ప్రభుత్వం తోడ్పాటునివ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాధితులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు. గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వటంతో పాటు దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలన్నారు.
షేక్ అహ్మద్‌నగర్‌లో చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు.
ఇదీ చదవండి