సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి నిధులు ఇవ్వాలని జల్‌శక్తి కార్యదర్శి పంకజ్ కుమార్‌కు విజ్ఞప్తి చేశామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం విషయంలో గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను నూతనంగా బాధ్యతలు చేపట్టిన పంకజ్ కుమార్‌కు వివరించామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆయకట్టు అభివృద్ధి, పునరావాసం, పరిహారం విషయంలో 2014లో కేంద్ర క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. పౌర విమానయాన శాఖ కార్యదర్శి కరోలాని కలిసి ఓర్వకల్లు (కర్నూలు) విమానాశ్రయం ప్రారంభోత్సవంపై చర్చించినట్లు బుగ్గన వెల్లడించారు. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్.కె.సింగ్‌ను గురువారం కలిసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ పంపింగ్ విధానంలో చేపట్టదలచిన అప్పర్ సీలేరు ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, ఇతర విషయాల్లో సహకరించాలని కోరామన్నారు. కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో గ్రాంట్లు తెచ్చుకోవడం, రుణ భారం తగ్గించుకోవడంపై దృష్టి సారించినట్లు ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. విభజన హామీల అమలుతో పాటు జాతీయ రహదారులు, రైల్వేలు, పారిశ్రామిక నడవాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కన్నా ఎక్కువ మొత్తం కేంద్ర బడ్జెట్‌లో కేటాయించాలని ప్రతిపాదనలు పంపినట్లు బుగ్గన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జలను తప్పించాలని గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ