Anam Ramnarayana Reddy Meeting With Chandrababu: సీనియర్ నేత, మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతలు సమావేశమవ్వగా.. వీరి సమావేశంపై రాజకీయ వర్గాలలో తీవ్ర అసక్తి నెలకొంది. ఇటివలే వైసీపీ నుంచి వైదొలగిన ఈ నేత.. టీడీపీ అధినేతను కలవటంతో వీరిద్దరు సమావేశంలో ఏం చర్చించరనే అంశంపై రాజకీయాలలో చర్చ నడుస్తోంది.
చంద్రబాబు, రాం నారాయణరెడ్డి భేటీ : తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి భేటీ అయ్యారు. రాత్రి హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి చేరుకున్న ఆనం.. సుమారు గంటపాటు సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగంపై ఆనం రాంనారాయణరెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయాలపైనే వీరిరువురు చర్చించినట్లు తెలిసింది. శనివారం వెంకటగిరి, నెల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గ నేతలతో ఆనం భేటీ కానున్నారు. ఈనెల 12న లోకేశ్ పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. అప్పటి కల్లా ఆనం తెలుగుదేశంలో చేరికపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు లోకేశ్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఆనం వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూరిరెడ్డి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
నెల్లూరుకు రాం నారాయణ రెడ్డి : చంద్రబాబుతో శుక్రవారం రాత్రి సమావేశమైన మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి నెల్లూరుకు చేరుకోనున్నారు. ఆయన నెల్లూరుకు చేరుకున్న అనంతరం ఆయనతో మాజీ మంత్రి సోమిరెడ్డి, బీదా రవిచంద్రలు అల్పాహార విందుకు హాజరుకానున్నారు. అనంతరం టీడీపీ నేతలతో కలిసి టీడీపీ కార్యాలయానికి చేరుకోనున్నారు. పార్టీ కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ కార్యకర్తలు ఆనంతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నారా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్రకు స్వాగత ఏర్పాట్లపై చర్చించనున్నట్లు సమాచారం. ఇటివలే లోకేశ్ పాదయాత్ర సీమ జిల్లాల్లో పూర్తయి 12 వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది.
Tdp Leaders Meeting With Kotamreddy Sridhar Reddy ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంటికి టీడీపీ నేతలు : వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన అనంతరం ఏ పార్టీలో చేరతారనే సందేహం ఉండేది. ప్రస్తుతం నెల్లూరు రాజకీయాలను గమనిస్తే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. నెల్లూరులోని మాగుంట లేఔట్‌లోని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటికి టీడీపీ నేతలు వెళ్లారు. మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి, బీదా రవిచంద్రలతోపాటు ఇతర టీడీపీ నేతలు వెళ్లనున్న తరుణంలో నెల్లూరులో పార్టీ పరిస్థితులు.. రాష్ట్రంలోని పరిస్థితులపై వీరు చర్చించనున్నట్లు సమాచారం.