నెల్లూరు జిల్లాలో రొయ్యల అక్రమ సాగు, పర్యావరణ కాలుష్యంపై విచారణ నివేదిక సిద్ధమైంది. కలెక్టర్ ద్వారా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్.జీ.టీ.)కి అందించేందుకు ప్రత్యేక కమిటీ అడుగులు వేస్తోంది. రెండు రోజుల క్రితం కమిటీ సభ్యులు కలెక్టర్ చక్రధర బాబును కలిసి... నివేదికను సమర్పించారు.
జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు. ఆ తర్వాత స్థానంలో ఆక్వా నిలుస్తుంది. ఇంతటి కీలకమైన రొయ్యలు, చేపల సాగులో అక్రమాలు ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలోని కోట, వాకాడు, మండలాల్లో అనధికార రొయ్యల గుంటలు ఇబ్బందిగా మారాయంటూ స్థానిక రైతులు చెన్నైలోనే గ్రీన్ ట్రిబ్యునల్, లోకాయుక్తలను ఆశ్రయించారు.
సబ్ కలెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో వివిధ శాఖల అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో విచారించి, 15.10.2020 నాటికల్లా నివేదిక సమర్పించాలని ఈ ఏడాది జులై 22న ఎన్.జీ.టి. ఆదేశాలిచ్చింది. ఆ మేరకు కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఆ కమిటీ సభ్యుల బృందం సుమారు 45 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలపై అధ్యయనం చేసింది. వ్యవసాయ, మత్స్య, కాలుష్య నియంత్రణ మండలి, జలవనరుల శాఖ ఇలా అనేక మంది అధికారులు తమదైన రీతిలో అధ్యయనం చేసి నివేదికలు అందించారు. ఆ సమగ్ర వివరాల నివేదిక రెండు రోజుల క్రితం కలెక్టర్ కు చేరగా, ఒకట్రెండు రోజుల్లో ఎన్.జీ.టీ.కి చేరనుంది.
ఇదీ చదవండీ...