YCP Samajika Sadhikarata Bus Yatra: ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన బస్సుయాత్ర.. 'బుస్సుయాత్ర'గా మారిందని తెలుగుదేశం నేతలు ఎద్దేవా చేశారు. సామాజిక సాధికార బస్సు యాత్రకు దళిత, బీసీ, మైనారిటీ వర్గాల స్పందన కరువై, మంత్రుల ముఖాలు వెలవెలబోతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీలు బిక్కుబిక్కుమని భయంతో బతికే పరిస్థితి ఎందుకొచ్చిందో జగన్ సమాధానం చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. అబ్దుల్ సత్తార్, అబ్దుల్ సలాం కుటుంబాలను, చిన్నారి మిస్బాను ఎవరు బలితీసుకున్నారో, మైనారిటీ యువకుల్ని వైసీపీ నేతలు, మంత్రులు ఎందుకు పొట్టనపెట్టుకున్నారో ముఖ్యమంత్రి చెప్పాలని పేర్కొన్నారు.
వైసీపీ నేతలకు సవాల్: వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడైనా... మచ్చుకైనా సామాజిక న్యాయం ఉందా అంటూ టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉండే ప్రాంతాలకు సామాజిక సాధికార బస్సుల్ని తీసుకెళ్లే ధైర్యం ఉందా అని మంత్రులు, వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. గిరిజన యువతపై తప్పుడు కేసులు.. గిరిజన మహిళలపై దాడులు, అత్యాచారాలు... గిరిజన సంపద దోపిడీ తప్ప జగన్ రెడ్డి వారికి చేసింది శూన్యమని మండిపడ్డారు. ఎస్టీల సంక్షేమానికి వెచ్చించాల్సిన నిధుల్ని జగన్ దుర్వినియోగం చేశాడని ఆరోపించారు.
YSRCP Samajika Sadhikarata Bus Yatra in Tirupati : వైసీపీ సామాజిక సాధికారత బస్సుయాత్ర.. సామాన్యులకు తప్పని అవస్థ
చిలకలూరిపేటకు చేరుకున్న సైకిల్ యాత్ర: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు చేపట్టిన సైకిల్ యాత్ర సోమవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చేరింది. బొప్పూడి వద్ద ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు ఎంఎస్ రాజుకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గొల్లపల్లి సూర్యారావు, బి.రామాంజనేయులు యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి పట్ల అన్ని విషయాల్లోనూ వైసీపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులతో ఏపీ దేశంలో నెంబర్-1 స్థానంలో నిలిచిందని ఆరోపించారు. దాడులను అరికట్టకుండా... సామాజిక న్యాయయాత్రలు చేపట్టడం వైసీపీకే చెల్లిందని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
సంఘీభావం నేతలు: నగరంలోని తెలుగుదేశం కార్యాలయం నుంచి ఏఎంజీ వరకు మంత్రులు ప్రత్తిపాటి, గొల్లపల్లి సూర్యారావు, బి.రామాంజనేయులు సైకిల్ తొక్కి సంఘీభావం తెలిపారు. వ్యవస్థలు నిర్వీర్యమైతే, వ్యవస్థలను శాసించే వ్యక్తి నియంత, ఫ్యాక్షనిస్టు, అప్రజాస్వామికవాదిగా మారుతాడని దుయ్యబట్టారు. అలాంటి సందర్భంలో రాష్ట్రంలో అందరి కంటే ముందు నష్టపోయేది అట్టడుగు, అణగారిన వర్గాలకు చెందినవారేనని ఎంఎస్ రాజు పేర్కొన్నారు. సీఎం జగన్‌కు రాజ్యాంగం, శాసన, న్యాయ వ్యవస్థలపై ఎలాంటి నమ్మకం లేదని విమర్శించారు. ఎస్సీల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ ఎస్సీలపైనే దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.