Tiger migration in Palnadu district: పల్నాడు జిల్లా సరిహద్దు గ్రామాల్లో బెబ్బులి సంచారం ప్రజల్లో అలజడి సృష్టిస్తోంది. మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లోని శివారు ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పులి గురించే చర్చిస్తున్నారు. ఏ సమయంలో ఎటునుంచి పులి దాడి చేస్తుందేమోనని బిక్కుబిక్కుమంటున్నారు. పల్నాడు జిల్లా విజయపురిసౌత్ ప్రాంతంలో తరచూ పులుల సంచారం ఉంటోంది. ఇటీవల మేత కోసం వెళ్లిన ఆవుపై పెద్దపులి పంజా విసిరిన ఘటనతో ఆ ప్రాంత వాసుల్లో ఒక్కసారిగా భయాందోళనలు రేకెత్తాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 75 వరకు పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 2 నెలల క్రితం ఒక తల్లి, రెండు కూనలు మార్కాపురం అటవీ పరిధిలోని అక్కపాలెంలో అధికారులకు కనిపించాయి.
గత నెల 26న దుర్గి మండలం గజాపురం సమీపంలో ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత నుంచి మళ్లీ వాటి జాడ కనిపించలేదు. వాటి వయస్సు రెండేళ్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవలె దుర్గి మండలంలో వేటాడిన పులులు ఇవే అయ్యి ఉండచ్చని భావిస్తున్నారు. పల్నాడులోని లోయపల్లి, గజాపురం, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నట్లు చెబుతున్నారు. వాటి కదలికల్ని గుర్తించేందుకు కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్.. 44 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. పులులు సాధారణంగా తన పరిధిని 25 నుంచి 50 కిలోమీటర్లు వరకు విస్తరించుకుంటాయి. సంతానోత్పత్తి కోసం వాటి పరిధి నుంచి బయటకు వస్తాయి. ఆహారం, నీటి కోసం సరిహద్దు గ్రామాలవైపు వస్తుంటాయి. ఇలా వచ్చిన పులులు కొన్ని రోజుల తర్వాత వాటి స్థానానికి తిరిగి వెళ్లిపోతుంటాయి. ఈ క్రమంలోనే పల్నాడు అటవీ ప్రాంత పరిధిలోకి వచ్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. పల్నాడు శివారు గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
పశువుల కాపర్లు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. పులులు సరిహద్దు గ్రామాల్లోకి రాకుండా అవి సంచరించే ప్రాంతాల్లో ఆహారం, నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. సాధ్యమైనంత తొందరగా పులుల జాడను గుర్తించి.. వాటిని అడవిలోకి తరలించాలని పల్నాడు శివారు ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పులులు నుంచి మనుషులకు ఎటువంటి హాని ఉండదని.. వాటిని భయబ్రాంతులకు గురిచేయొద్దని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వాటి ఆనవాళ్లు గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
ఇవీ చదంవడి: