Referendum To Establish Cement Factory: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలంలోని చెన్నై పాలెం గ్రామంలో ఈరోజు సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం పర్యావరణ ప్రజాభిప్రాయం సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ లోతేటి శ్యామ్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ పర్యావరణ పరిరక్షణ ప్రజాభిప్రాయం సేకరణ చేశారని, ఈ వేదికలో రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని తెలిపారు. అలాగే రైతుల సమస్యలను పరిష్కరిస్తామని సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపిందని వివరించారు. శబ్ద కాలుష్యం, వాయువు కాలుష్యం, నీటి కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు నీటిలోని మినరల్స్ సమతుల్యత పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సరస్వతి సిమెంటు ఫ్యాక్టరీ త్వరగా నిర్మించాలని, విద్యా, వైద్యం ఇలా అన్ని వసతులు కల్పించాలని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, ఫ్యాక్టరీలో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సిమెంటు ఫ్యాక్టరీ పరిసర గ్రామాలను దత్తత తీసుకోవాలని కోరారు. భూములు ఇచ్చిన ప్రతీ రైతుకు న్యాయం చేసే విధంగా ఫ్యాక్టరీ యాజమాన్యం కృషి చేయాలని తెలిపారు. ఇంటి ఇంటికి తాగునీటి వసతి కల్పించాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా చెన్నై పాలెం, వేమవరం, తంగేడ, ముత్యాలంపాడు, పిన్నేల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ అనే పేరుతో ప్రజలకు కొంతమందికి మాట్లాడే హక్కును కల్పించలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి కాబట్టి చేశాము అన్నట్టు.. తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని నిర్వహించారని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు లేక వెలవెలబోయిందని పేర్కొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేశారు కానీ, కలెక్టర్.. ఎమ్మెల్యేలు కార్యక్రమానికి రాకపోవడంతో రైతులు కొంతమంది మాత్రమే వచ్చారని చెప్పారు. ప్రజలు లేక సభా ప్రాంగణం వెలవెలబోయిందని స్థానికులు తెలిపారు.
పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసే వరకు ఎవరి భూమి వారు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నాం. ఇక్కడ ఉన్న భూమి మొత్తంలో 95శాతం భూమి చెన్నై పాలెం రైతులది. ఆ భూమి వేమారు శివారు, వేమారులో ఉంది కాబట్టి చెన్నై పాలెం, వేమవరం, తంగేడ రైతులకు నిష్పత్తి ప్రకారంగా ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఆదాయాన్ని ఆయా గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెట్టాలని తెలియజేస్తున్నాం.- స్థానికుడు
ఇవీ చదవండి: