POLICE ARREST THE TDP LEADERS : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాచర్లలో టీడీపీ నేతలపై దాడుల నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీ నేతలు "చలో మాచర్ల"కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మాచర్ల పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణ శివారు ప్రాంతాల్లో రాయవరం, కొత్తపల్లి కూడళ్లలో వాహనాలను తనిఖీలు చేపట్టారు. టీడీపీ నేతలు పట్టణంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
పిడుగురాళ్లలో యరపతినేని అరెస్ట్: గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయం నందు గురజాల మాజీ శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావుని మాచర్లకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట సంభవించింది. మాచర్ల వెళ్లకుండా ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారని యరపతినేని నిలదీయగా.. పోలీసులు ఏమీ సమాధానం చెప్పలేక, పైనుంచి మాకు సమాచారం లేదని..మాట దాటే ప్రయత్నం చేశారు. అనంతరం రోడ్డు పైకి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని వెళ్లకుండా నిరాకరించే సమయంలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
పొందుగల వద్ద టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు: దాచేపల్లి మండలం పొందుగుల వద్ద తెదేపా నేతలు బీవీ ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు, కొమ్మలపాటి శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ల వెళ్తుండగా హైవేపై కారును అడ్డగించారు. అదుపులోకి తీసుకుని దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజి మంత్రి ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాచర్లలో 144 సెక్షన్ అమల్లో ఉందని అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదని నోటీసులు ఇచ్చారు.
నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కి నక్కా : మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల ఘటనపై బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకుని నగరం పాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు మాచర్ల బయలుదేరిన ఉమ్మడి గుంటూరు జిల్లా తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ధూలిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. గురజాలలో యరపతినేని ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నియోజకవర్గంలోని ముఖ్యనేతలు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఇవీ చదవండి: