Sankranti Luckydra: జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీడ్రా టికెట్ల విక్రయాల వ్యవహారంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని పోలీసులను బుధవారం గుంటూరు కోర్టు ఆదేశించింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ లక్కీడ్రా టికెట్లు అమ్మడంపై జనసేన నేతలు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. సత్తెనపల్లిలో దినసరి కూలీ అనిల్ ప్రమాదంలో మరణిస్తే సీఎం సహాయనిధి నుంచి వచ్చిన డబ్బుల్లో వాటా అడిగారని జనసేన నుంచి అంబటి ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే లక్కీడ్రా టికెట్ల వ్యవహారంలో మంత్రి పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బలవంతంగా లక్కీడ్రా కూపన్లు: రాష్ట్రంలో లాటరీ టికెట్ల అమ్మకాలపై నిషేధం ఉన్నా చట్టాలేవీ తమకు వర్తించవన్నట్లుగా మంత్రి వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. సామాన్యులకు ఆశలు కల్పించే లక్కీడ్రా వంటి వాటికి బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి ప్రచారం చేయొచ్చా, వంద రూపాయలే కదా ప్రతి ఒక్కరూ కూపన్ కొనండని కోరవచ్చా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీడ్రా పేరుతో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతోపాటు వైఎస్సార్ కానుక పింఛన్లు అందుకుంటున్న వారికి బలవంతంగా లక్కీడ్రా కూపన్లు అంటగడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించడం వైసీపీ నాయకులకు మింగుడుపడటం లేదు.
అయిదేళ్లుగా సంక్రాంతి సంబరాలు: సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో 2018 నుంచి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. 2018, 2019లలో ముగ్గుల పోటీలు నిర్వహించి సొంత సొమ్ముతో మహిళలకు నగదు బహుమతులు అందించారు. అంబటి ఎమ్మెల్యే అయ్యాక 2020లో తొలిసారి సంక్రాంతి సంబరాలకు కూపన్ల ద్వారా లక్కీడ్రా విధానం తీసుకువచ్చారు. వైఎస్సార్ సంక్రాంతి లక్కీడ్రా పేరిట టికెట్లు విక్రయిస్తున్నారు. 2021, 2022ల్లోనూ ఇది కొనసాగింది. ఈసారి కూడా సంక్రాంతి సందర్భంగా లక్కీడ్రా ఏర్పాటు చేశారు. మొదటి బహుమతిగా డైమండ్ నెక్లెస్, ద్వితీయ బహుమతిగా రెండు కార్లు, తృతీయ బహుమతిగా మూడు ట్రాక్టర్లు, నాలుగో బహుమతిగా నాలుగు బుల్లెట్లతోపాటు రిఫ్రిజిరేటర్లు, ఎల్‌ఈడీ టీవీలు, మిక్సీలు బహుమతులుగా ప్రకటించారు. ఒక్కో కూపన్ ధర రూ.100గా నిర్ణయించారు. సీఎం జగన్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మంత్రి అంబటి ఫొటోలతోపాటు ఆకట్టుకునేలా బహుమతుల చిత్రాలు ముద్రించిన లక్కీ డ్రా టికెట్ల పుస్తకాలను వైకాపా ద్వితీయశ్రేణి నాయకులకు ఇచ్చి లక్ష్యాలు విధించారు. వారు క్షేత్రస్థాయిలో పని చేసే యంత్రాంగానికి అందించారు. వారు నియోజకవర్గవ్యాప్తంగా కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరులకు విక్రయిస్తున్నారు. మొత్తం రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. పనిలో పనిగా కొందరు నాయకులు టికెట్లను సామాన్యులకు అంటగడుతూ చందాలు వసూలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
మహిళల్ని ఆకర్షించాలనే ఉద్దేశం: ‘సంక్రాంతి పండగకు ఆడాళ్లు అరిసెలు, గారెలు, బూరెలు చేసుకుంటారు. మగాళ్లు ఏం చేస్తారు? కోడి పందేలు, పేకాటకు వెళతారు. మందేస్తారు.. వాటికి వెళ్లొద్దు. మనందరి కోసం ఒక చిన్న లాటరీ పెడదాం. తలో వంద రూపాయలు పెట్టి కూపన్ తీసుకోండి.. లాటరీ తగిలితే మంచి బహుమతి ఇస్తాం. తొలి ఏడాది ఒక కారు పెట్టాం.. ఈసారి రెండు కార్లు, మూడు ట్రాక్టర్లు, నాలుగు బైకులు, ఐదు షైన్ బైకులు, 11 ఫ్రిజ్‌లు, 13 ఎల్‌ఈడీ టీవీలు, 75 మిక్సీలు పెట్టాం.. వీటన్నింటికీ మించి మహిళల్ని ఆకర్షించాలనే ఉద్దేశంతో డైమండ్ నెక్లెస్ పెట్టాం. అది రూ.16 లక్షలు అవుతుందని మా నాయకులు చెబుతున్నారు. మన నాయకులంతా కలిసి నిర్వహిస్తున్న పోటీ ఇది. 12న నిర్వహించే డ్రాలో నెక్లెస్ ఎవరికి వస్తుందో? బహుమతులే కాకుండా మీరిచ్చే వంద రూపాయల్లోనే గారెలు, బూరెలు, పాలతాలికలు వంటి పిండివంటలు పెడుతున్నాం.
- డిసెంబరు 29న సత్తెనపల్లిలో సచివాలయాల కన్వీనర్లు, వాలంటీర్లు, పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సంక్రాంతి లక్కీడ్రా టికెట్ల అమ్మకాలకు మంత్రి అంబటి రాంబాబు చేసిన ప్రచారమిది.
ఇవీ చదవండి