Students death with Heart attack: హార్ట్ స్ట్రోక్.. ఇప్పుడు ఈ మాట వింటుంటేనే అందరూ భయపడుతున్నారు. ఇన్నాళ్లూ ఒక వయస్సు దాటిన వారికి.. అధిక బరువు ఉన్నవారికి వచ్చే గుండెపోటు ఇప్పుడు విద్యార్థులను సైతం వెంటాడుతోంది. తాజాగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఆ టెన్షన్ అందరినీ భయపెడుతోంది. తాజాగా ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర ఘటన పల్లాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పసుమర్రు గ్రామానికి చెందిన పటాన్ వజీర్ బాషా, మస్తానిలకు పర్జాన, ఫిరోజ్ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫర్జానా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుకుంటోంది. ఫిరోజ్ ఖాన్ చిలకలూరిపేటలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఎంపీసీ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 15వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇందుకోసం ఎప్పటిలాగే చదువుకుని.. రాత్రి నిద్రకు ఉపక్రమించిన ఫిరోజ్ ఖాన్(17).. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒక్కసారిగా పెద్దగా గురక పెట్టడం మొదలుపెట్టాడు.
పక్కనే ఉన్న సోదరి పర్జానా ఇది గమనించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు వచ్చి ఫిరోజ్‌కు మంచినీళ్లు తాగిద్దామని చూశారు.. కానీ నీళ్లు మాత్రం అతడి గొంతు దాటి లోపలికి పోలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గుండెపోటుతో పది నిమిషాల క్రితమే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు, సోదరి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 17 సంవత్సరాలకే గుండెపోటుతో కుమారుడు మృతి చెందడం వారిని తీవ్ర మనోవేదనకు గురి చేసింది.
తమ కుమారుడు కష్టపడి చదువుకుంటాడని, అతడికి ఎలాంటి ఒత్తిడి, అనారోగ్యం లేదని.. ఎందుకు ఇలా జరిగిందో తమకు అర్థం కావడం లేదని తండ్రి వజీర్ భాషా వాపోయాడు. కరోనా సమయంలో మొదటి, రెండవ డోస్ వ్యాక్సిన్లు కూడా వేయించానని తెలిపాడు. ఎలాంటి కారణం లేకుండా గుండెపోటుతో తన కుమారుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుందని కన్నీటిపర్యంతమయ్యాడు. మృతి చెందిన విద్యార్థిని చూసేందుకు వచ్చిన తోటి విద్యార్థులు, స్నేహితులు బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
బాలుడిని పరీక్షించిన వైద్యులు డాక్టర్ కొమ్మినేని వీర శంకరరావు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. చిన్నపిల్లల్లో ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. మెదడుకు, గుండెకు రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోయి విద్యార్థి మృతి చెందినట్లు గుర్తించామన్నారు. పుట్టుకతో ఏదైనా సమస్య ఉంటే ఇలా ఒక్కసారిగా గుండెపోటు వస్తుందని, ఇలాంటివి గుర్తించడం కూడా కష్టమని ఆయన అన్నారు. గుండెపోటుతో విద్యార్థి మృతి చెందడం తమకు కూడా బాధ కలిగించిందని డాక్టర్ తెలిపారు.
"మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఇంతకుముందు కొవిడ్ సమయంలో రెండు ఇంజక్షన్లు చేసుకున్నాడు. మంగళవారం తెల్లవారు జామున 2.30 గంటలకు ఫిరోజ్‌కు గురక రావటం గమనించాం. అతడికి నీళ్లు పట్టించేందుకు ప్రయత్నించాం. నీళ్లు గొంతు దాటి లోపలికి పోకపోయే సరికి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించాం. అయితే ఫిరోజ్ 10 నిమిషాల క్రితమే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు." - ఫటాన్ వజీర్ భాష, విద్యార్థి తండ్రి
కబడ్డీలో విద్యార్థికి గుండెపోటు.. చికిత్స పొందుతూ మృతి
మరోవైపు సత్యసాయి జిల్లా మడకశిర మండలం అచ్చంపల్లిలో గుండెపోటుతో తనూజ్ నాయక్ అనే ఓ విద్యార్థి మృతి చెందాడు. పీవీకేకే కళాశాలలో బీ-ఫార్మసీ చదువుతున్న అతడు ఈ నెల 1న కబడ్డీ ఆడుతూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే బెంగళూరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ విద్యార్థి మంగళవారం మృతి చెందాడు.
ఇవీ చదవండి: