AP CM Jagan fire on BJP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు బహిరంగ సభల్లో ప్రసంగించినా.. తెలుగుదేశం పార్టీపైన, జనసేన పార్టీపైన విమర్శలు చేసేవారూ.. తాజాగా భారతీయ జనతా పార్టీని కూడా ఆ జాబితాలో చేర్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తనకు అండగా ఉండకపోవచ్చని.. తాను వాళ్లని నమ్ముకోలేదంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజలే తన సైన్యమని జగన్ వ్యాఖ్యానించారు.
జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ.. పల్నాడు జిల్లా క్రోసూరులో ఈరోజు జగనన్న విద్యా కానుక పథకం కింద నాలుగో విడత కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలుత విద్యార్థులతోపాటు తరగతి గదిలో కూర్చున్న సీఎం జగన్.. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పాఠశాలలు ప్రారంభమయ్యే రోజున విద్యా కానుకను అందిస్తున్నామన్నారు. మెరుగైన విద్యను అందించేందుకు నాలుగేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. అనంతరం పాఠశాలల ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు ఆయన విద్యాకానుక కిట్లను అందజేశారు.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. క్రోసూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ..''ప్రభుత్వ పాఠశాల్లో మెరుగైన విద్యను అందించేందుకు ఈ నాలుగేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. నాలుగో విడత ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రారంభిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చాక.. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. పాఠశాలలు ప్రారంభమయిన రోజే విద్యాకానుకను అందిస్తున్నాం. పెదకూరపాడు నియోజకవర్గంలో రూ.217కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాం. విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలు చేశాం. ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన విద్యార్థులు ఉండాలి. టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమం చేపట్టాం. అమెరికాకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఇంగ్లీష్ మాట్లాడటంలో మన విద్యార్థులకు ప్రతిభ పెరుగుతుంది. రాష్ట్రంలోని 52 మంది ఇంగ్లీష్ టీచర్లకు అమెరికాలో శిక్షణ ఇప్పిస్తున్నాం'' అని ఆయన అన్నారు.
బీజేపీపై జగన్ విమర్శలు.. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుపై, పవన్ కల్యాణ్‌పై, బీజేపీపై విమర్శలు కురిపించారు. క్రోసూరు బహిరంగ సభలో సీఎం జగన్.. విపక్షాలపై ఎప్పటిలాగే పాత విమర్శలే గుప్పించారు. ఎప్పుడూ తెలుగుదేశ పార్టీ, జనసేనపైనే విమర్శలు చేసే సీఎం.. ఈసారి భారతీయ జనతా పార్టీని కూడా ఆ జాబితాలో చేర్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తనకు అండగా ఉండకపోవచ్చని.. తాను వాళ్లని నమ్ముకోలేదని జగన్ వ్యాఖ్యానించారు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజలే తన సైన్యమని అన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో మీ ఇంట్లో మంచి జరిగిందా..? లేదా..? అనేదే కొలమానంగా తీసుకోవాలని.. మంచి జరిగితే అండగా నిలవాలని జగన్ విజ్ఞప్తి చేశారు.