PAPER ARTS DESIGNED BY WOMAN : ఎవరైనా కాగితాలతో వర్షం నీటిలో ఆడుకోవడానికి పడవలు లాంటివి తయారు చేస్తారు. మరికొంత మంది వాటిపై వివిధ రకాల ఆకృతుల్లో బొమ్మలు వేసి.. టైం పాస్ చేస్తారు. కానీ ఈమె మాత్రం కాగితాలతో చక్కటి రాధాకృష్ణా, పక్షుల, జంతువుల బొమ్మలు తయారు చేస్తుంది. వాటితో పాటు ఇంటి అలంకరణకు కావల్సి వివిధ రకాల అందమైన ఆకృతులను తయారు చేస్తుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి ఇలా కాగితాలతో అందమైన ఆకృతులను తయారు చేయాలన్న కోరిక ఉండేదట. ఆ కోరికకు తన భర్త సహకారం తోడవ్వడంతో తన ఆలోచనలకు మరింత పదును పెట్టానంటుంది. కాగితాలతో అందమైన ఆకృతులను తయారు చేస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్న మేడ రజని పై ప్రత్యేక కథనం.
విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన మేడా రజనీ బాల్యంలోనే కాగితాలతో పలు రకాల బొమ్మలు తయారు చేసి పలువురి మన్ననలు పొందారు. వివాహనంతరం ఆమె భర్త సతీష్ ప్రోత్సాహంతో.. కాగితాలతో వివిధ కళాకృతులు తయారు చేస్తూ ఇంటి వద్దే పలువురికి ఉపాధి కల్పిస్తుంది రజనీ. వివిధ వ్యాపార సంస్థల అవసరాలకు. శుభకార్యాలకు పలు ఆర్టర్స్ సప్లై చేస్తూ.. ఆన్‌లైన్ , ఆఫ్ లైన్‌లో క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆస్టాజెన్ సంస్థలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సపోర్టివ్ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే వివిధ ప్రదర్శనల్లో స్టాల్స్ ప్రదర్శిస్తూ ...తనదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. పలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ చదువుతున్న పేద విద్యార్థులకు ఉచిత శిక్షణనిస్తున్నారు.
కాగితాలతో తయారు చేసే బొకేలు, అందమైన బొమ్మలతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదంటున్నారు రజనీ. ఆమె ప్రతిభకు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. వస్త్రాలతోనూ ఆకర్షణీయమైన ఆకృతులను రజనీ తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో ఉపాధి శిక్షణా తరహా పాఠశాలను నెలకొల్పి మరింత మంది మహిళలకు ఉపాధి అవకాశాలందించాలంటున్నారు రజనీ.
ఇవీ చదవండి: