Warning to women on CM Sabha : సీఎం జగన్ సభ ఉందంటే చాలు.. మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ఎన్ని పనులున్నా వదులుకుని సభకు రావాల్సిందేనంటూ ముందస్తుగానే వారికి హెచ్చరికలు అందుతున్నాయి. సీఎం సభకు కచ్చితంగా రావాల్సిందే... మీరు రాకుంటే మా ఉద్యోగాలు పోతాయ్... ఓ రిసోర్స్ పర్సన్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విజయవాడలోని విద్యాధరపురం మినీ స్టేడియంలో శుక్రవారం జరగబోయే ముఖ్యమంత్రి సభ కోసం డ్వాక్రా మహిళలను తరలించేందుకు రిసోర్స్ పర్సన్లు నానా తంటాలు పడుతున్నారు. పెద్ద ఎత్తున మహిళలను తీసుకురావాలంటూ పైనుంచి ఒత్తిళ్లు రావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
'గ్రూపు సభ్యులందరికీ గుడ్ మార్నింగ్.. ఇప్పటికే ప్రతీ ఒక్క గ్రూపునకు కాల్ చేశాను. ఇంకా ఎవరైనా మిస్సయ్యి ఉంటే తెలుసుకుంటారని ఈ మెసేజ్ పెడుతున్నా. శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర కల్లా మీరంతా మా ఇంటి దగ్గరికి రావాలి. ఇక్కడ విద్యాదరపురం స్టేడియంలో సీఎం సభ ఉంది కాబట్టి.. ఆ సభకు ఎట్టి పరిస్థితుల్లో మీరంతా రావాలి. మేం ప్రతి ఒక్కరం 150 మందిని సభకు తీసుకు రావాలని చెప్పారు. లేదంటే మా ఉద్యోగాలు ఉండవని కచ్చితంగా చెప్పారు. మీరంతా ఇక్కడికి వస్తే ఆటోలు పెట్టి స్టేడియం దగ్గరకు తీసుకువెళ్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్తున్నాను.' ఇది ఓ రిసోర్స్‌పర్సన్ పెట్టిన వాయిస్ మెసేజ్.
CM Jagan Fake Propaganda on State Progress: "వేదికేదైనా.. అలవోకగా అబద్ధాలు". ఇదీ మన ముఖ్యమంత్రి తీరు
శుక్రవారం విజయవాడ విద్యాధరపురం స్టేడియంలో ఐదో విడత వైఎస్సార్ (YSR) వాహన మిత్ర నిధుల విడుదల కార్యక్రమం జరగబోతోంది. ఈ సభకు డ్వాక్రా గ్రూపు మహిళలను పెద్ద సంఖ్యలో తీసుకురావాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ బాధ్యతను రిసోర్స్ పర్సన్ (RP)లపై పెట్టారు. ఒక్కొక్కరు 150 మందిని తీసుకురావాలని హుకూం జారీ చేశారు. డ్వాక్రా మహిళలు (Dwakra women) కచ్చితంగా రావాలంటూ రిసోర్స్ పర్సన్లు ఒత్తిడి చేస్తున్నారు. రేపు ఉదయం ఎనిమిదిన్నర లోపు గ్రూపు సభ్యులందరూ తమ ఇంటి వద్దకు రావాలని... అక్కడి నుంచి ఆటోల్లో సభకు తానే తీసుకెళ్తానని చెప్పారు. ఒకవేళ మీరు రాకపోతే మా ఉద్యోగాలు పోతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అర్థం చేసుకుని... సహకరించాలని బ్రతిమలాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సీఎం జగన్ సభలకు డ్వాక్రా గ్రూపులను బలవంతంగా తరలించడంపై మహిళల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. రాజధానిలో సెంటు పట్టాల పంపిణీ కార్యక్రమం సహా ఎక్కడ సభలు జరిగినా డ్వాక్రా గ్రూపుల నిర్వహణను చూసే రిసోర్స్ పర్సన్లు, ఇతర సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తెచ్చి మరీ జనాన్ని తరలిస్తున్నారు. సభలకు వచ్చేందుకు మహిళలు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఒత్తిడి తెచ్చి మరీ తీసుకెళ్లడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.