Life Imprisonment To Killer: పార్కులు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఏకాంతంగా ఉన్న జంటలు అతని దృష్టిలో పడ్డాయా అంతే సంగతులు.. ఒక్కసారిగా సైకో మాదిరిగా ప్రవర్తిస్తాడు. అతన్ని హత్య చేసి, మహిళపై అత్యాచారం చేస్తుంటాడు. రాష్ట్రంలో పలు చోట్ల ఇదే తరహాలో నేరాలకు పాల్పడ్డాడు. పోలీసులు ఆ హంతకున్ని పట్టుకుని కోర్టు మెట్లు ఎక్కించారు. అతనికి కోర్టు తగిన శిక్ష విధించేలా చేశారు.
పలు చోట్ల హత్యలు, అత్యాచారాలు : రాష్ట్రంలో ఏకాంతంగా ఉన్న జంటలనే లక్ష్యంగా చేసుకుని హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్న వ్యక్తికి జీవిత కాల జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 16వ జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస రావు ఈ తీర్పు ఇచ్చారు. జిల్లా అదనపు కోర్టు ఏపీపీ ఈశ్వరప్రగడ రంగారావు తెలిపిన వివరాలు ప్రకారం ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామం సమీపంలో దొడ్డదేవరపాడు రోడ్డు పక్కనున్న సుబాబుల్ తోటలో 2019 సంవత్సరం జనవరిలో ఏకాంతంగా గడిపేందుకు గుండుగొర్ల గోపీ ఓ మహిళతో కలిసి వెళ్లాడు. ఆ సమయంలో జి.కొండూరు మండలం చెర్వుమాధారం గ్రామానికి చెందిన పొట్లూరి అంకమరాజు ఆ జంట వద్దకు వెళ్లాడు. అక్కడ గోపీని హత్య చేశాడు. తర్వాత మహిళపై అత్యాచారానికి యత్నించాడు. ఈ సమయంలో ఆమె తన అనారోగ్య సమస్య గురించి చెప్పటంతో అత్యాచారం చేయకుండా వదిలేశాడు. దీనిపై ఫిర్యాదు మేరకు వీరులపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇదే విధంగా పలు ప్రాంతాల్లో హత్యలు చేసి, మహిళలపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
19 మంది సాక్ష్యులను విచారించిన న్యాయమూర్తి : ఇలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో నేరానికి పాల్పడ్డాడు. తడికలపూడి పోలీసుస్టేషన్ పరిధిలో ఇదే విధంగా నేరం చేయటంతో అక్కడి పోలీసులు నిందితుడు పొట్లూరి అంకమరాజును అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో వీరులపాడు పరిధిలోను హత్య చేసినట్లు తెలిపాడు. దీంతో వీరులపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 19 మంది సాక్ష్యులను న్యాయమూర్తి విచారించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఈశ్వర ప్రగడ రంగారావు వ్యవహరించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలింపు : పొట్లూరి అంకమరాజుపై నేరం రుజువు కావటంతో సెక్షన్ 302 ప్రకారం జీవితకాల జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించారు. అత్యాచారయత్నానికి పాల్పడినందుకు ఐదేళ్లు జైలు శిక్ష, ఐదు వేల రూయాలు జరిమానా జరిమానా విధించారు. అనంతరం ముద్దాయిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.
ఇవీ చదవండి