RTC EMPLOYEES PROBLEMS: ఆర్టీసీలో 50 వేలకు పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో అత్యధికంగా డ్రైవర్లు, కండక్టర్లు ఉంటారు. రోజూ ఎక్కువసేపు కూర్చుని బస్సు నడపడం, రాత్రిళ్లు మేల్కొని దూర ప్రాంతాలకు బస్సులు నడపడం, సమయ వేళలు లేకుండా పలు ప్రాంతాల్లో బయట భోజనం చేయాల్సి రావడం తదితర కారణాలతో డ్రైవర్లు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు.
బస్సుల్లో ఎక్కువసేపు కూర్చోవడం, నిల్చొని పని చేయాల్సి రావడం వల్ల కండక్టర్లూ అనారోగ్యానికి గురవుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లకు ఎక్కువగా గుండె, కిడ్నీ, లివర్ సమస్యలు, కేన్సర్ లాంటి జబ్బులు వచ్చి అకస్మాత్తుగా మరణించే పరిస్థితి తలెత్తుతుంది. కార్మికుల సంక్షేమం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేకంగా వైద్య సదుపాయం అందించే ఏర్పాట్లు చేసింది. విజయవాడ, కడపలో ఆర్టీసీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి.
సిబ్బందికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఇక్కడ వైద్యం అందుబాటులో ఉంటుంది. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగానే పరీక్షలు, వైద్యం చేస్తారు. కిడ్నీ, లివర్ మార్పిడి, గుండె సంబంధిత సమస్యలు, పక్షవాతం తదితర మేజర్ చికిత్సలకు ఉచితంగానే వైద్యం అందించే ఏర్పాట్లు ఉండేవి. ఒక్కో కార్మికుడికి 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ సంస్థే భరించి ప్రాణాలు నిలబెట్టేది. దీంతో కార్మికులకు వైద్యం సంబంధించి ఎంతో భరోసా ఉండేది.
అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అనంతరం పరిస్ధితి ఒక్కసారిగా మారిపోయింది. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వంలో ఉద్యోగులను విలీనం అనంతరం అప్పటివరకు ఆర్టీసీ సంస్థ ద్వారా అందించే అపరిమిత వైద్య సదుపాయాన్నిప్రభుత్వం ఎత్తివేసింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే EHS కార్డులను జారీ చేసింది. కార్డులు వచ్చిన ఆర్టీసీ ద్వారా అందిస్తోన్న వైద్యాన్నే అందిస్తామని నమ్మబలికింది. నిజమే అని నమ్మిన ఉద్యోగులకు అనతి కాలంలోనే తత్వం బోధపడింది.
ఆర్టీసీ ఆస్పత్రుల్లో అపరిమిత వైద్యాన్ని నిలిపివేసిన ప్రభుత్వం..ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలని సూచించింది. తీరా ఆస్పత్రులకు వెళ్తే కొన్ని ఆస్పత్రుల్లో ఈ హెచ్ఎస్ కార్డులను తీసుకోవడం లేదు. కొన్నింటిలో పరిమితంగా మాత్రమే వైద్యాన్ని అందిస్తామని స్పష్టం చేశాయి. దీంతో సరైన సమయంలో వైద్యం అందక ఆర్టీసీ ఉద్యోగులు వారి కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొంతమంది ప్రాణాలు వదిలేసిన దుస్థితి నెలకొంది.
పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి గతంలో ఉన్న తరహాలోనే ఆర్టీసీ ద్వారా అపరిమిత వైద్యం అందించాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ప్రయోజనం లేదు. ఆర్టీసీ ఉద్యోగుల పనితీరు దృష్టిలో పెట్టుకుని పాత విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఎన్నోసార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేదు. ఆర్టీసీ కార్మికులకు పాత విధానంలో వైద్యం అందిస్తామని ప్రభుత్వ సలహాదారు గతంలో ఇచ్చిన హామీ నీటి మూటలుగానే మిగిలాయి. దీంతో వైద్యం కోసం ఆర్టీసీ కార్మికుల అష్టకష్టాలు పడుతున్నారు.
ఈహెచ్ఎస్ కార్డు ద్వారా కేవలం రూ.2 లక్షల వరకే తొలుత వైద్యం అందిస్తున్నారని, ఆ తర్వాత ప్రత్యేకంగా అనుమతి తెచ్చుకోవాలని ఆస్పత్రులు చెబుతున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదంటున్నారు. గతంలో ఎన్ని లక్షలు ఖర్చైనా ఆర్టీసీ సంస్ధ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో చెల్లింపులు చేయడం వల్ల అనేకమంది అవయవాలు మార్పిడి లాంటి మేజర్ చికిత్సలు చేసుకుని జీవిస్తున్నారు.
ఈహెచ్ఎస్ కార్డుతో ఆ సదుపాయం లేకపోవడం వల్ల అనారోగ్యంతో మంచాన పడి ప్రాణాలు వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు రాత్రిపగలు పనిచేసే విధానం వల్ల జబ్బులు చుట్టుముడుతున్నాయని, వీరిని ప్రత్యేక కేటగిరీగా భావించి సంస్థ ద్వారా అపరిమత వైద్య సదుపాయం అందించాలని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో ఉన్న అపరిమిత వైద్య సదుపాయాన్ని కల్పించాలని ఆర్టీసీలోని ప్రధాన కార్మిక సంఘాలు ఎన్ఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్లు పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లేఖలు రాశారు. ఆర్టీసీ ఎండీ సహా ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమస్యలను వివరించి పాత విధానం అమలు చేయాలని వేడుకున్నారు. ప్రభుత్వం అదిగో ఇదిగో అని కాలం వెళ్లదీయడం తప్ప సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఇటీవల కాలంలో ఆర్టీసీలో అనారోగ్యంతో చికిత్స అందక చనిపోయే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
విలీనం చేసిన మాటే గానే విలీనం అనంతరం వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఉద్యోగులు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విలీనంతో ప్రయోజనాలు పెరుగుతాయని ఆశించి ఆంగీకరిస్తే.. ఉన్న సదుపాయాలను తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన వైద్య సేవలు అందక ఉద్యోగులు, కుటుంబ సభ్యులు చనిపోతున్నా సమస్యను పరిష్కరించకపోవడం దారుణమంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులకు హామీ ఇచ్చినట్లు అపరిమత ఖర్చుతో పాత వైద్య చికిత్సలను అందించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: