Bribes in Mutation of Lands: రైతుల భూముల మ్యుటేషన్.. రెవెన్యూ సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. ముడుపులు ఇచ్చుకోకుంటే భూరికార్డుల్లో కొత్త వివరాలు నమోదు చేయడం లేదు. మ్యుటేషన్ జరగకుంటే బ్యాంకుల నుంచి రుణాలు వంటి సౌకర్యాలను అన్నదాతలు పొందలేరు. మ్యుటేషన్ కోసం దరఖాస్తులు స్వీకరించిన 21 రోజుల్లోగా పరిష్కరించకుంటే కారణాలు తెలపాలని రెవెన్యూశాఖ నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో కొన్నిచోట్ల సిబ్బంది కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దరఖాస్తు చేయకముందే రైతులతో వీఆర్వోలు బేరాలు కుదుర్చుకుంటున్నారు. ఆ తర్వాత వీఆర్వో నుంచి వచ్చే మౌఖిక ఆదేశాలతో గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్.. సంబంధిత రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించే సంస్కృతి మొదలైంది. స్వీకరణకు ముందే ఒప్పందాలు జరుగుతన్నందున.. 21 రోజుల్లోగా దరఖాస్తులు పరిష్కారమవుతున్నాయి. ఒక్కో రైతు నుంచి వసూలు చేసిన మొత్తంలో వీఆర్వో నుంచి.. 3, 4 అంచెల్లో తహసీల్దార్ల వరకూ వాటాల పంపిణీ జరుగుతోంది.
భూముల బదలాయింపు..లేదంటే రికార్డుల్లో తప్పుల సవరణ కోసం రైతులు దరఖాస్తు చేస్తే.. వీటిపై వీఆర్వో విచారణ జరిపి.. 15 రోజుల్లోగా సిఫార్సు చేయాలనిగానీ లేదా తిరస్కరించాలని గానీ తహసీల్దారుకు నివేదిస్తారు. దీనిపై తహసీల్దారు వారంలోగా నిర్ణయం తీసుకోవాలి. దీన్ని అనుసరించి రికార్డుల్లో మార్పులు, పట్టాదారు పాసు పుస్తకాల జారీ జరుగుతుంది. కొందరు నిబంధనల ప్రకారం మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసినా.. వెంటనే వీఆర్వోలు కలుగజేసుకుని మెలికలు ఏదో ఒక కొర్రీ పెడుతున్నారు. వారు అడిగినంత ముడుపులిస్తే ఈ వేధింపులేవీ ఉండవు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను విచారణ అనంతరం తహసీల్దారుకు వీఆర్వోలు తెలియజేస్తూనే.. మాన్యువల్ విధానంలో ఆర్‌ఐ, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దారు వరకు వివరించాల్సి ఉన్నందున.. అవినీతితోపాటు వాటాలూ పెరుగుతున్నాయి.
గత నెల రెండో వారం వరకూ రాష్ట్రవ్యాప్తంగా.. సవరణల కోసం 95 వేల 160 దరఖాస్తులు వస్తే.. 10 వేల 417 తిరస్కారానికి గురయ్యాయి. ఇవి కాకుండా మరో 2 వేల 500 దరఖాస్తులను నిర్ణీత వ్యవధి దాటిన అనంతరం తిరస్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 44 వేల 125 సర్వే నంబర్లలో ఉన్న భూముల బదలాయింపు కోసం దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో 50 వేల దరఖాస్తులను పరిశీలన దశలోనే తిరస్కరించారు. రిజిస్ట్రేషన్ జరిగిన అనంతరం మ్యుటేషన్ ఎందుకు చేయలేకపోతున్నారని.. విజయవాడలో శుక్రవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సుకు హాజరైన తహసీల్దార్లను సీసీఎల్ఏ సాయిప్రసాద్ ప్రశ్నించారు. ఇందుకు సాంకేతిక సమస్యలు, క్షేత్రస్థాయిలో భూముల వివాదాలు వంటి అంశాలు కారణమని.. తహసీల్దార్లు వివరణ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని తహసీల్దార్లను మ్యుటేషన్ ఫైళ్లు తీసుకుని మంగళవారం సీసీఎల్ఏ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీచేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో సవరణల కోసం 18 వందల 24 దరఖాస్తులు వస్తే.. సకాలంలో 800 పరిష్కారమయ్యాయి. భూబదలాయింపు కోసం 9 వేల 429 దరఖాస్తులు వస్తే.. 4 వేల 481 సకాలంలో పరిష్కారానికి నోచుకున్నాయి.
క్రయ, విక్రయాలు.. లేదంటే వారసత్వంగా సంక్రమించిన భూవిస్తీర్ణం ఆధారంగా.. మామూళ్ల వసూళ్లు జరుగుతున్నాయి. ఎకరా భూమి పేరు మార్చాలంటే.. 5 వేల రూపాయల వరకు వసూలు చేస్తారు. ఇది.. ఆ భూమి ఉన్న ప్రాంత డిమాండును అనుసరించి 40 వేల రూపాయల వరకు పెరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట వీఆర్వో గోవిందరావు.. అడిగిన డబ్బు ఇస్తేనే మ్యుటేషన్ చేస్తానని స్పష్టం చేయడంతో.. దరఖాస్తుదారుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించారు.
ఇవీ చదవండి: