Revenue Services Association Council Meeting in AP: విజయవాడలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ 17వ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) పాల్గొన్నారు. రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, సహా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ నేతలు మంత్రి ధర్మాన ముందు ఏకరువు పెట్టారు.
వీఆర్ఏలకు వేతనాలు ఏ మాత్రం సరిపోవడం లేదని వెల్లడించారు. హెచ్ఆర్ఏ లేకపోవడం వల్ల కష్టాలు పడుతున్నట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. వీఆర్ఏలకు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 1500 మంది వీఆర్ఏలు పరీక్ష పాస్ కాలేదని, ప్రొబేషన్ ఇవ్వడం లేదని, పరీక్షతో సంబంధం లేకుండా అందరికీ వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని కోరారు. మేము 24 గంటల పాటు ఎంత కష్టాన్నైనా పడతామని, సినిమా హాల్లో టికెట్లు సైతం అమ్ముతామన్నారు. టెలి కాన్ఫరెన్స్‌ల వల్ల రెవెన్యూ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. టెలికాన్ఫరెన్స్‌లను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. జూన్ 20ని రెవెన్యూ డేగా అమలు పరచాలని, రెవెన్యూ ఉద్యోగులందరి సర్వీసు రూల్స్ ఏకీకృతం చేయాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.
ఆత్మాభిమానం చనిపోతే విపత్కర పరిస్థితులు వస్తాయని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మ చంద్రారెడ్డి అన్నారు. జిల్లాల్లో నలుగురు జేసీలు చేసే పని ఒక్కరే చేస్తున్నారని, వారిపై తీవ్ర ఒత్తిడి ఉంటోందన్నారు. జిల్లాల్లో అదనపు జాయింట్ కలెక్టర్లను పునరుద్దరించాలన్న ఆయన.. 26 జిల్లాలకు వెంటనే అదనపు జేసీలను ఇవ్వాలని, డిప్యూటీ కలెక్టర్లకూ వాహనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం జిల్లాల్లో ముగ్గురు జేసీలుగా పెంచి మళ్లీ తగ్గించిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జేసీలను ఎందుకు పెంచారో ...ఎందుకు తగ్గించారో తమకు తెలియడం లేదన్నారు. గతంలో ఇచ్చినట్లుగా ముగ్గురు జేసీలను ఇస్తే బాగుంటుందన్నారు. జిల్లాల్లో ప్రొటో కాల్ బడ్జెట్ ఇవ్వడం లేదని , దీనివల్ల కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో తెలియడం లేదని మరో నేత రమేష్ కుమార్ తెలిపారు. సీఎం కార్యక్రమాలకు సైతం ఇలాగే ఉందని, ప్రొటోకాల్ నిధులివ్వాలని నేతలు కోరారు. రెవెన్యూ ఉద్యోగులకు(Revenue employees) ఇళ్ల స్థలలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.
APRSA Bopparaju Venkateswarlu : 'రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి.. స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం'
తమ దృష్టికి తెచ్చిన సమస్యలను సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులకు ఇబ్బందులు ఉన్నాయని, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తమకు తెలుసన్నారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలు అమలు చేసేందుకు సీఎం చర్యలు తీసుకున్నారని మంత్రి తెలిపారు. చుక్కల భూములు, షరతుల భూముల సమస్యలు పరిష్కారం కాబోతున్నాయన్నారు. ఉద్యోగులంతా సంస్కరణలను సమర్థంగా అమలు చేయాలని మంత్రి కోరారు. ఉద్యోగులు ఎప్పటుకప్పడు అప్ డేట్ కాకపోతే అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రెవెన్యూ ఉద్యోగులు చట్టానికి అనుగుణంగా పనిచేయాలని, ఏ మాత్రం అతిక్రమించవద్దని రెవెన్యూ శాఖ(Revenue Department) స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని సూచించారు.