New Master Plan for Vijayawada Kanaka Durga Temple: వైసీపీ ప్రభుత్వంలో రెండున్నరేళ్లకు మంత్రులే కాదు.. మాస్టర్ ప్లాన్‌లూ మారిపోతున్నాయి. దానికి నిదర్శనమే ఈ నమూనాలు.! ఈ రెండూ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధి కోసం రూపొందించినవే. కాకపోతే.. ఒకటి అప్పటి దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో రూపొందించగా.. మరొకటి.. ప్రస్తుత దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. తయారు చేయించారు.
2020వ సంవత్సరం దసరా ఉత్సవాలు..! బెజవాడ దుర్గమ్మకు సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఇంద్రకీలాద్రి ఆలయ అభివృద్ధి పనులకు.. 70 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని ప్రకటించారు. అప్పటి దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హడావుడి చేసేశారు. ప్రసాదాల పోటు.. కేశఖండనశాల సహా బృహత్తర ప్రణాళిక నమూనాలను తయారు చేయించారు. సీఎం జగన్‌ను.. తెచ్చి మరీ శంకుస్థాపన చేయించారు. కానీ.. వాటిలో ఒక్క భవనానికీ పునాది పడలేదు. జగన్ ప్రకటించిన 70కోట్ల నిధులు.. మూడేళ్లవుతున్నా దుర్గగుడికి ఇవ్వలేదు. ఫలితంగా ఆలయ అభివృద్ధికి రూపొదించిన బృహత్ ప్రణాళిక. ఇదిగో ఇలా గ్రాఫిక్స్ దశలోనే ఉండిపోయింది. వెల్లంపల్లి.. మంత్రి పదవీ పోయింది.
సీన్ కట్ చేస్తే.. దేవదాయశాఖకు కొత్త మంత్రివచ్చారు. ఆయనే కొట్టు సత్యనారాయణ. దుర్గగుడి సమగ్రాభివృద్ధి కోసం.. ఆయన మరో బృహత్తర ప్రణాళిక తయారు చేయించారు. ప్రభుత్వం మారలేదు. ముఖ్యమంత్రీ మారలేదు. కానీ.. కొత్తగా వచ్చిన కొట్టు సత్యనారాయణ మాత్రం.. గత నమూనాలను పక్కన పెట్టేశారు. కొత్తగా 225 కోట్ల రూపాయలతో.. బృహత్తర ప్రణాళిక నమూనాలను ప్రదర్శించారు.
విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో.. మహాయజ్ఞం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎంకు ఆ నమూనాలు చూపించి.. ఆమోద ముద్ర వేయించుకున్నారు. గత నమూనాలు.. వాటి నిర్మాణ ప్రాంతాల విషయంలో లోపాలున్నాయని, అందుకే మాస్టర్ ప్లాన్ మార్చినట్లు చెప్పుకొచ్చారు.. మంత్రి కొట్టు సత్యనారాయణ. మరి ఆ లోపాలకు.. బాధ్యులెవరు? వాటిని తయారీ చేయించిందీ జగన్ కేబినెట్‌లోని మంత్రేకదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అమ్మవారి నిధులు వెచ్చించి మంత్రికో మాస్టర్ ప్లాన్ తయారు చేయించడం విమర్శలకు తావిస్తోంది. గత ప్రణాళికలు పక్కనపెట్టడంతో.. ప్రసాదంపోటు, అన్నదాన భవనం, కేశ ఖండనశాల.. 6 కోట్లతో కల్యాణ మండపాలు ఇవన్నీ మళ్లీ మొదటికొచ్చాయి. గుడ్‌గావ్‌కు చెందిన నిపుణులతో.. కొత్త నమూనాలు తయారు చేయించామన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. తిరుపతిలో అలిపిరి ప్రవేశ మార్గం మాదిరిగా ఇంద్రకీలాద్రిలోనూ.. ఏర్పాటు చేస్తామని తెలిపారు.
టీటీడీ తరహాలో క్యూలైన్లు, మంచినీరు, మరుగుదొడ్ల వసతులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఆగ్నేయంలో 3అంతస్థుల్లో ప్రసాదంపోటు, విక్రయ కేంద్రం, నిలువ గదులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దాని పక్కనే భక్తులు సేదదీరేందుకు డార్మెటరీలు ఉంటాయని, సామూహిక కల్యాణ మండపం నిర్మిస్తామని తెలిపారు. భక్తులు ఒకేసారి 600 కార్లు నిలిపేందుకు అవసరమైన పార్కింగ్ సైతం అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.
ఇవీ చదవండి: