AP Lorry Owners Association: రోడ్డు టాక్స్ పెంపు నుంచి రవాణా వాహనాలను మినహాయించాలని ఏపీ లారీ యజమానుల సంఘం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరింది. ప్రస్తుతం లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరిస్తూ... పన్ను పెంపును మినహాయించాల్సిన వివరాలను తెలియజేస్తూ లేఖ రాశారు. కోవిడ్ అనంతరం రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని లారీ యజమానుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు లేఖలో సీఎంకు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే డీజిల్ ధర ఎక్కువగా ఉందని లేఖలో పేర్కొన్నారు.
కర్ణాటక కన్నా రూ.12, తమిళనాడుతో పోలిస్తే రూ.4-5 ఎక్కువగా డీజిల్ ధర ఉందని వివరించారు. ఏ రాష్ట్రంలో లేని రోడ్డు సెస్‌ను ఏపీలో వసూలు చేస్తున్నారని, జరిమానాలను వెయ్యి నుంచి రూ.20 వేల వరకు పెంచుతూ ఆదేశాలిచ్చారని గుర్తుచేస్తూ... రెండు ఆదేశాలను ఉపసంహరించాలని అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. కోవిడ్ సంక్షోభం దృష్ట్యా ఇతర రాష్ట్రాల్లో లారీలకు అక్కడి ప్రభుత్వాలు పన్ను మినహాయింపులు ఇచ్చినా ఇక్కడ ఏమీ ఇవ్వలేదని తెలిపారు.
ఇప్పుడు త్రైమాసిక పన్నుల పెంపు వల్ల లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతారని, ప్రస్తుతం ఉన్న పన్నులపై 25 నుంచి 30 శాతం పెంచినా.. పన్ను చెల్లించే పరిస్ధితి లేదని తెలిపారు. నష్టాల దృష్ట్యా ఇప్పటికే వేల లారీలు ఫైనాన్షియర్లు సీజ్ చేసి పట్టుకు పోయారన్నారు. నష్టాల కారణంగా లారీ యజమానులు కొద్దిపాటి ఆస్తులు కూడా అమ్ముకున్నారని, పన్నులు పెంచితే ఆంధ్రాలో లారీలను సరిహద్దు రాష్ట్రాలకు అడ్రస్ మార్చుకోవాల్సిన దుస్ధితి వస్తుందని తెలిపారు.
పరిస్ధితుల దృష్ట్యా పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. పన్నుల పెంపుపై ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్ ను వెంటనే ఉపంహరించాలని విన్నవించారు.
ఇవీ చదవండి: