Lagadapati: ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో శని, ఆదివారాల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పర్యటించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌తో పాటు పలువురు వైకాపా, కాంగ్రెస్ నాయకులతో సమావేమయ్యారు. శనివారం రాత్రి చందర్లపాడులో నందిగామ మార్కెట్ యార్డు ఛైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు కుమారుడు వివాహ రిసెప్షన్‌కు లగడపాటి, వసంత హాజరయ్యారు. అనంతరం నందిగామలోని స్థానిక మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ పాలేటి సతీష్ ఇంట్లో లగడపాటి బస చేశారు. ఆదివారం ఉదయం లగడపాటి, వసంత కృష్ణ ప్రసాద్ కలిసి అల్పాహారం తీసుకున్నారు.
నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, వైకాపా నాయకులు మాజీ ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు. తరువాత నందిగామలో ఇటీవల మృతి చెందిన వైకాపా నాయకుడు మంగులూరి కోటిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐతవరంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావును కలిశారు. కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన గుదే వెంకటేశ్వరరావు ఇటీవల మృతి చెందారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన పర్యటనకు, రాజకీయాలకు సంబంధం లేదని లగడపాటి విలేకరులకు తెలిపారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా? అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రేపాల మోహనరావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టరు కొమ్మినేని రవిశంకర్, కాలువ పెదబాబు, నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నెకంటి జీవరత్నం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మహిళలపై నేరాలు.. దేశంలో మొదటి స్థానంలో ఏపీ