Jada Sravan Kumar about RTI Act: కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమాచార హక్కు చట్టం పరిరక్షణకు ప్రజలు, ప్రజాసంఘాలు సమష్టిగా ఓ ఉద్యమానికి సిద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమైందని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ డిమాండ్ చేశారు. క్రమక్రమంగా అంతరించిపోతూ.. నిర్వీర్యం అవుతోన్న ఆర్‌టీఐ చట్టాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని.. విజయవాడలో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో పిలుపునిచ్చారు.
ఆర్టీఐ చట్టాన్ని రాజకీయ పార్టీలు ఏవీ సమర్థంగా కొనసాగించేందుకు సిద్ధంగా లేవని విమర్శించారు. ఈ చట్టం నిర్వీర్యం అవడం.. ప్రతి రాజకీయ పార్టీలకు.. రాజకీయ పార్టీ కనుసన్నల్లో పనిచేసే అధికారులకు అవసరమని విమర్శించారు. దోచుకోవడానికి, దాచుకోవడానికి.. ప్రతి ఒక్క అవినీతిపరుడైన వ్యక్తులు ఈ చట్టం నిర్వీర్యం అవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. మనం కట్టే ట్యాక్స్‌లను.. ప్రభుత్వం ఎలా ఖర్చు చేస్తుందో తెలుసుకునే బాధ్యత మనపై ఉంటుందని అన్నారు.
ఆర్టీఐ చట్టం పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేసేందుకు రాజకీయ పక్షాలు ముందుకు రాలేకపోతున్నాయని.. ఇందుకు కారణం ఈ చట్టం అంతరించిపోవాలని కోరుకుంటోన్న వారిలో.. మొదట ఉండేది రాజకీయ పార్టీలేనని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్న ప్రతి రూపాయి ఖర్చు.. ప్రభుత్వం వెబ్సైట్లో రోజూ అప్‌లోడ్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ జీవోలను సీక్రెట్‌గా దాచి పెడుతున్నారని ఆరోపించారు.
సమాచారం అడిగిన వారిపై కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారని అన్నారు. మన హక్కలను, చట్టాలను మనం పరిరక్షించుకోవాలని కోరారు. పన్నుల రూపంలో నడుస్తోన్న ప్రభుత్వం.. ఖజానా ఆదాయాన్ని ఏ విధంగా నిర్వహిస్తోందనే వివరాలు ప్రజల ముందు ఉంచడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నాయని నిలదీశారు. రెండు లక్షల కోట్ల రూపాయలు పన్నులుగా ప్రజలు చెల్లిస్తున్నందున - తమ వివరాలను కాగ్‌కు చెబుతున్నామని సరిపెట్టకుండా ప్రభుత్వ వైబ్‌సైట్‌లో ఏ రోజుకు ఆ రోజు ఖర్చుల వివరాలను అప్‌లోడ్ చేయాలని డిమాండ్ చేశారు.
జీవోలను రహస్యంగా ఉంచడం పారదర్శకత అనిపించుకోదని.. ముఖ్యమంత్రి తరచూ దిల్లీ పర్యటనలకు వెళ్తున్నందున.. ఎంత ఖర్చు చేస్తున్నారనే వివరాలపై ఆర్‌టీఐ ద్వారా సమాచారం కోరితే భద్రతా కారణాల రీత్యా ఇవ్వలేమని తిరస్కరించారన్నారు. ఓ ఆర్‌టీఐ కార్యకర్త అడిగిన సమాచారం ఇచ్చేందకు విముఖత చూపించిన ఆర్‌టీఐ కమిషన్... ఏకంగా అతనిపై కేసు పెట్టమని ఆదేశించడం ద్వారా స్వతంత్రంగా పని చేయాల్సిన కమిషన్.. రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందనడానికి ఉదాహరణగా చెప్పొచ్చన్నారు. ఆర్టీఐ కమిషన్ ఎలా ఉండాలనే విషయాలపై నిర్దిష్టమైన నిబంధనలున్నా.. అందుకు విరుద్ధంగా నియామకాలు జరుపుతున్నారని జడ శ్రావణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: