HC SERIOUS ON COLLECTOR : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో.. సర్వే నెంబర్లు 317, 326, 327 పరిధిలోని కాచేటి వాగు ప్రవాహానికి అడ్డంగా క్వారీ యజమానులు అక్రమంగా రోడ్లు వేశారు. సాగర్ ఎడమకాలువపై అనుమతి లేకుండా కల్వర్టులు కట్టారు. దీనిపై కంచికచర్ల మండలం నక్కలంపేటకు చెందిన మాగంటి ధర్మారావు... గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు... ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఆ తర్వాత సమర్పించిన తహసీల్దార్ నివేదిక, కలెక్టర్ నివేదిక మధ్య వ్యత్యాసం ఉండటాన్ని న్యాయస్థానం గుర్తించింది. నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఢిల్లీరావును ఆదేశించింది.
సోమవారం హాజరైన కలెక్టర్ ఢిల్లీరావుపై.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు పలు ప్రశ్నలు సంధించారు. తహసీల్దార్ నివేదికలో 45 సెంట్ల భూమి ఆక్రమణకు గురైనట్లు ఉండగా, కలెక్టర్ నివేదికలో మాత్రం 29 సెంట్ల స్థలమే ఆక్రమించినట్లు ఉన్న విషయం ప్రస్తావించారు. ఇద్దరిలో ఏ అధికారి అబద్ధం చెబుతున్నారని ప్రశ్నించారు. అధికారులు ఇచ్చిన ఫైలును పరిశీలించకుండానే కలెక్టర్ సంతకం చేసినట్లు ఉందన్నారు. ఆక్రమణలు తొలగించామనేది మీ మాటైతే, అడ్వకేట్ కమిషన్ ఏర్పాటుచేసి, వాస్తవాలను నిగ్గు తేలుస్తామన్నారు. ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారణైతే.. కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి అధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించారు.
వాగు ఆక్రమణలు ఇప్పటికే తొలగించామని, నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఆక్రమణలు తొలగించాల్సి ఉందని.. కలెక్టర్ ఢిల్లీరావు హైకోర్టుకు తెలిపారు. చైన్ విధానంలో సర్వే చేస్తే 45 సెంట్ల వాగు స్థలం ఆక్రమణకు గురైనట్లు తేలిందని.. కలెక్టర్ తరపున ప్రభుత్వ న్యాయవాది సుభాష్ నివేదించారు. అధునాతన విధానంలో కలెక్టర్ సర్వే చేయించడం వల్ల వ్యత్యాసం వచ్చిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించామన్నారు.
కోర్టు పట్ల గౌరవం ఉందని చెప్పారు. ఈ వాదనలపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. న్యాయస్థానాన్ని గౌరవించడమంటే తమ ఆదేశాలను తు.చ. తప్పక అమలు చేయడమే తప్ప.. కోర్టు ముందు హాజరుకావడం కాదని కాదని హితవుపలికారు. ప్రభుత్వ అధికారులపై నమ్మకం పోయిందని, ఆక్రమణలు తొలగించాలని ఆదేశాలిచ్చాక కూడా 21 వాయిదాలు తీసుకుంటారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ న్యాయవాది వినతి మేరకు.. ఆక్రమణల తొలగింపునకు మరో అవకాశం ఇస్తూ విచారణను జనవరి 3కు వాయిదా వేశారు. ఆక్రమణలు తొలగించినట్లు గూగుల్ ఛాయాచిత్రాలను కోర్టు ముందు ఉంచాలని తేల్చిచెప్పారు.
అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది N.సుబ్బారావు వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించలేదన్నారు. కాలువకు అడ్డంగా తాత్కాలిక కల్వర్టుల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు అధికారులే అంగీకరిస్తూ అఫిడవిట్ వేశారన్నారు.
ఇవీ చదవండి: