GOVT RETIRED EMPLOYEES ASSOCIATION : ఉద్యోగుల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజాప్రతినిధులు చెపుతున్నా.. కేవలం అవి మాటలకే పరిమితమవుతున్నాయి. పదో తారీఖు వచ్చిన ఇంకా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు.. అలాగే విశ్రాంతి ఉద్యోగులకు సైతం ఫించన్ అందలేదు. తాజాగా సకాలంలో పెన్షన్ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావును కలిసి వినతి పత్రం అందించారు. 10వ తేదీ వస్తున్న ఇంకా పెన్షన్ ఇవ్వకపోవడంపై విశ్రాంత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల నుంచి పెన్షన్ సక్రమంగా రావడం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు లోవా కుమార్ మండిపడ్డారు. పెన్షన్‌పై ఆధారపడిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
60 సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించిన తమకు ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదేనా అని ప్రశ్నించారు. ఈఎంఐలు కట్టకపోవడంతో చెక్స్బౌన్స్ అయ్యి జరిమానాలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మొదటి తేదీనే తమకు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇంటి అద్దెలు, నిత్యావసర సరుకులు, మందుల కొనుగోలుకు కూడా డబ్బులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పెన్షన్ కోసం స్పందనలో ఫిర్యాదు చేయాల్సి రావడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందో అర్ధం కావడం లేదని వాపోతున్నారు.
ఇవీ చదవండి: