Free Book Distribution: మనకి తెలియకుండానే మనలో చాలా మంది సెల్ ఫోన్స్, ల్యాప్ టాప్లు, కంప్యూటర్లతో అధిక సమయం గడిపేస్తున్నాం. ఒకప్పుడు ఏ విషయంపైనైనా పూర్తి స్థాయిలో అవగాహన రావాలంటే పుస్తక పఠనం ఒక్కటే మార్గంగా ఉండేది. మారుతున్న సాంకేతిక పరిస్థితుల్లో ఏ సమాచారం కోసమైన అధిక శాతం ప్రజలు ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు.
ఇంటర్నెట్లో మనకి కావాల్సిన సమాచారం సులభంగా, నిమిషాల్లో పొందగలుగుతున్నాం. అయితే ఇంటర్నెట్ వంటి సాధనాలు ఎన్ని అందుబాటులో ఉన్నా పుస్తక పఠనానికి ఉన్న ప్రాధాన్యత తగ్గలేదు. ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న వారు, ఏదైనా విషయంపై పరిశోధన చెస్తున్న వారికి ఉపయోగపడేది పుస్తక పఠనం మాత్రమే.
విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయంలో ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా.. ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సుమారు 55 వేల పుస్తకాలు ప్రజలకు అందుబాటులో ఉంచారు. గత ఏడు సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వహకురాలు రావి శారద తెలిపారు.
వందలాది మంది యువతీ, యువకులు ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వారికి కావాల్సిన పుస్తకాలు తీసుకెళ్తున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో పుస్తక హుండీలు ఏర్పాటు చేసి.. పుస్తకాలు సేకరించి.. ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు రావి శారద తెలిపారు. ఏడు సంవత్సరాలుగా విరామం లేకుండా పుస్తకాల ఉచిత పంపిణీ చేపట్టడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పుస్తకాలు సేకరించి పుస్తక ప్రియులకు అందిస్తామన్నారు.
విజయవాడ నుంచే కాకుండా చుట్టుపక్కల మండలాలు, జిల్లాల నుంచి వస్తున్నారు. వారి వద్ద ఉన్న వాటిని, వారికి అవసరం లేని పుస్తకాలను తీసుకొనివచ్చి.. పుస్తక సేకరణ హుండీలో వేస్తున్నారు. వారికి కావాల్సిన పుస్తకాలను తీసుకొని వెళ్తున్నారు. ఇలాంటి కార్యక్రమం తాము ఎక్కడా చూడలేదని పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు చెబుతున్నారు.
ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం వల్ల పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎంతో ఉపయోగం కలుగుతుందని వచ్చిన వారు అభిప్రాయపడ్డారు. నేడు, రేపు ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇంత చక్కటి అవకాశాన్ని విజయవాడ చుట్టుపక్కల ఉండే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వహకులు కోరారు.
"2015లో నా దగ్గర ఉన్న కేవలం 6 వేల పుస్తకాలతో.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. అప్పుడు కేవలం మూడు గంటల్లోనే పుస్తకాలు అన్నీ అయిపోయాయి. అప్పటి నుంచి.. పుస్తకాల హుండీ అని ఒకటి ఏర్పాటు చేశాం. గుడిలో హండీలో ఎలా అయితే డబ్బులు వేయడానికి ఉంటుందో.. అదే విధంగా పుస్తకాల హుండీని తయారుచేశాం. చాలా ప్రాంతాల నుంచి పుస్తకాలు పంపిస్తున్నారు. ఒకరికి రెండు, మూడు పుస్తకాలు ఇస్తున్నాం. కాలేజీలకు, లైబ్రరీ నడుపుతున్న వారికి అయితే ఎక్కువ పుస్తకాలు ఇస్తున్నాం. ఇప్పటి వరకూ 2 లక్షల పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సారి 50 వేల పుస్తకాలు ఉన్నాయి". - రావి శారద, ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమ నిర్వహకురాలు
ఇవీ చదవండి: