Beneficiaries Of TIDCO Houses Living In Rented Houses : గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణానికి 354 కోట్ల రూపాయలు వెచ్చించింది. గృహ సముదాయంలో ప్రధాన మౌలికవసతుల అభివృద్ధికి 75 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇప్పటి వరకు 60 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధికి గతంలో ఉన్న ప్రభుత్వమే టెండర్లు ఖరారు చేసి, పనులు ప్రారంభం చేసింది.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ టెండర్లు రద్దు చేసి ఏడాది తర్వాత మళ్లీ టెండర్లు పిలిచింది. వాటి ఖరారుకు మరో ఏడాది పట్టింది. 2022 నవంబరు నుంచి ప్రధాన మౌలిక వసతుల పనులు మొదలయ్యాయి. తాగునీరు, విద్యుత్ సరఫరా తప్ప మిగతావి పూర్తయ్యాయి. లబ్ధిదారుల్లో నాలుగు వేల మందికి టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ పూర్తైంది. మిగిలిన పనుల్ని కొలిక్కి తీసుకువచ్చి లబ్ధిదారులకు ఇళ్లు ఎప్పుడు అప్పగిస్తారో తెలియంటం లేదు.
టిడ్కో ఇళ్లలో 430 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్లు 2 వేల496, 365 చదరపు అడుగుల ఫ్లాట్లు 15 వందల36, 300 చదరపు అడుగుల ఫ్లాట్లు 992 ఉన్నాయి. గత ప్రభుత్వం అన్ని కేటగిరీల ఫ్లాట్లకూ 3 లక్షలు రాయితీ ఇచ్చింది. మిగలిన మొత్తాన్ని బ్యాంకులతో అనుసంధానం చేసి రుణాలు ఇప్పించాలన్నది ప్రభుత్వ విధానం. దాని ప్రకారం.. ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోగా, 300 చదరపు అడుగుల ఫ్లాట్లకు లబ్ధిదారు 2.65 లక్షల రుణం తీసుకుంటారు. 365 చదరపు అడుగుల ఫ్లాట్‌కి 50వేలు చెల్లిస్తారు. బ్యాంకు నుంచి 3.15 లక్షల రుణం తీసుకుంటారు. 430 చదరపు అడుగుల ఫ్లాట్‌కి లక్ష చెల్లిస్తారు. బ్యాంకు నుంచి 3.65 లక్షల రుణం తీసుకుంటారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 300 చదరపు అడుగుల వరకు టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. లబ్ధిదారులు కట్టాల్సిన మొత్తాన్ని 365 చదరపు అడుగుల ఫ్లాట్లకు 25 వేలకు, 430 చదరపు అడుగుల కేటగిరీలో 50 వేలకు తగ్గించింది.
రాజధానిలో పేదలకు టిడ్కో ఇళ్ల కోసం గతంలో ఉన్న ప్రభుత్వం వ్యూహాత్మకంగా కీలకమైన ప్రదేశాల్నే ఎంపిక చేసింది. ఉదాహరణకు రాజధానిలో ప్రముఖ సంస్థల ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలకు వేదిక అవుతుందనుకున్న సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా ఎంపిక చేసిన ప్రాంతానికి సమీపంలో, సీడ్‌యాక్సెస్ రోడ్డు పక్కనే పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టింది.
రాజధాని నిర్మాణం అనుకున్నది అనుకున్నట్టుగా కొనసాగి ఉంటే టిడ్కో ఇళ్ల సముదాయాలన్నింటికీ మెరుగైన అనుసంధానత ఏర్పడేది. ఎక్కడి వారికి అక్కడే ఉపాధి దొరికేది. రాజధాని పనులు నిలిపివేయడంతో టిడ్కో ఇళ్లు నిర్మించిన కొన్ని ప్రాంతాలు ఇప్పుడున్న గ్రామాలకు దూరంగా మిగిలిపోయి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ఆ పరిసరాలన్నీ అడవుల్ని తలపిస్తున్నాయి. ప్రభుత్వం ఆ ఇళ్లు అప్పగించినా లబ్ధిదారులు తమ అవసరాల కోసం అక్కడికి దగ్గర్లోని గ్రామాలకు రావలసిందే.
"లక్ష రూపాయలు అప్పుకు తీసుకు వచ్చి కట్టాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదిగో ఇస్తాం..అదిగో ఇస్తాం అని మభ్యపెడుతుంది. సీఆర్డీఎ వాళ్లతో నెక్ట్స్ మంత్ ఇస్తాం అని చెప్పకుకుంటూ పోతున్నారు. కానీ ఇప్పటికీ ఇవ్వటం లేదు."- టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు
"ఆరు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు అప్పుకు తీసుకు వచ్చి కట్టాను. వడ్డీ 2 లక్షలు అయ్యింది. మొత్తంగా మూడు లక్షలు అయ్యింది. పైగా అద్దె ఇంట్లో ఉంటున్నాను. నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు"-. టిడ్కో ఇంటి లబ్ధిదారుడు
ఇవీ చదవండి