Subabul Farmers Agitation at Nandigama RDO Office: సుబాబుల్ కర్రకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీవో కార్యాలయం వద్ద సుబాబుల్ రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు సుబాబుల్ కర్రకు టన్నుకు ఐదు వేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకూ నాలుగు సార్లు కంపెనీ ప్రతినిధులతో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు జరిపినా సుబాబుల్ రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగలేదన్నారు.
ముఖ్యమంత్రి జగన్.. ఎన్నికల ముందు సుబాబుల్ రైతులకు మాట ఇచ్చారని.. కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా రైతుల గోడు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చి.. తాను మాట తప్పను, మడప తిప్పను అని నిరూపించుకోవాలని తెలిపారు.
పేపరు కంపెనీలు దళారులను ప్రోత్సహిస్తూ రైతులకు ధర రాకుండా చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పేపర్ కంపెనీల పక్షమా, రైతుల పక్షమా తెలియజేయాలన్నారు. రైతులకు రక్షణగా ఉండాల్సిన మార్కెటింగ్ శాఖ చోద్యం చూస్తుందన్నారు. తక్షణం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన మార్కెటింగ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, పేపర్ కంపెనీ ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సుబాబుల్ రైతులకు ధర వచ్చేటట్లు చూడాలని డిమాండ్ చేశారు.
"మేము అధికారంలోకి వస్తే అయిదు వేల రూపాయలు ఇప్పిస్తామని చెప్పి ఆ రోజు ప్రగల్భాలు పలికి.. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్నా.. రైతుల గోడు పట్టించుకున్న దాఖలాలు లేవు. నందిగామ నియోజకవర్గ శాసనసభ్యులు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుబాబుల్ రైతుల పట్ల మాట్లాడారు. కానీ ఈ రోజు సుబాబుల్ రైతుల పక్షాన ఎందుకు మాట్లాడటం లేదు. సుబాబుల్ పండిస్తున్న రైతుల పక్షాన నడిచి.. వారికి గిట్టుబాటు ధర ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం". - రైతు
"ముఖ్యమంత్రి గారు.. నందిగామ ప్రాంతం వచ్చి.. టన్నుకు అయిదు వేల రూపాయలు ధర చెల్లిస్తాము మేము అధికారంలోకి వస్తే అని చెప్పారు. ఓట్లు వేశాము. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతుంది. మీరు అప్పుడు చెప్పారు. మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి.. ఈ రోజు సుబాబుల్ రైతుల విషయంలో మాట తప్పారు అని.. మడమ తిప్పారు అని తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ టన్ను అయిదు వేల రూపాయల గురించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం". - రైతు
ఇవీ చదవండి: