Fake Votes in Vijayawada: విజయవాడ మధ్య నియోజకవర్గం 63వ డివిజన్ సుందరయ్య నగర్ ప్రాంతంలోని 67వ బూత్‌లో డోర్ నంబరు 77-149-20తో ఉన్న ఇంట్లో ఏకంగా 48 ఓట్లను జాబితాలో చూపారు. ఈ ఇంట్లో ఆరుగురు మాత్రమే నివసిస్తున్నారు. మిగిలిన 42 మంది ఎక్కడివారో స్థానికులు సైతం గుర్తించలేకపోతున్నారు. ఇదే డోర్ నంబరుకు ఎ, బి అని తగిలించి మరో 15 ఓట్లు చేర్చారు. అవన్నీ దొంగ ఓట్లేనని స్థానికులు చెబుతున్నారు. 'నో' డోర్ నంబరుతో ప్రతి బూత్‌లోనూ వందల సంఖ్యలో ఓట్లు చేర్చారు. వాటిలో ఎక్కువ శాతం ఓటర్లు ఎవరో స్థానికులకే తెలియని పరిస్థితి. 59వ డివిజన్‌లో నివసిస్తున్న తంగిరాల మోషేకు 33వ బూత్‌లో ఓటు ఉంది. దీన్ని ఆధార్‌కు అనుసంధానం చేయకపోవడంతో.. 31వ బూత్‌లోని ఓటర్ల జాబితాలోనూ ఓటుంది. 63వ డివిజన్‌లోని 67వ నంబరు బూత్‌లో ఓ వీధిలో 200 మంది ఓటర్లు ఉంటే వారికి 63, 65, 67 ఇలా ఆరు బూత్‌లలో ఓటు హక్కు కల్పించారు.
విజయవాడ మధ్య నియోజకవర్గ ఓటరు జాబితా ఎంత గజిబిజిగా, గందరగోళంగా, అడ్డగోలుగా తయారయిందో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నియోజకవర్గంలోని 21 డివిజన్లలో 257 పోలింగ్ బూత్‌లు, సుమారు 2.80 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఏ పోలింగ్ బూత్‌లోనూ ఓటర్ల జాబితా వరుస క్రమపద్ధతిలో డోర్ నంబర్ల ఆధారంగా లేదు. ఒక పోలింగ్ బూత్ పరిధిలో నివాసముంటున్న వారి ఓట్లు వేరొక బూత్‌లో ఉంటున్నాయి. ఒకే ఇంట్లో ఓటర్లను వేర్వేరు పోలింగ్ బూత్‌ల్లో చేర్చడంతో అంతా గజిబిజిగా ఉందని, టీడీపీ సానుభూతిపరుల ఓట్లనే ఇలా గందరగోళంగా జాబితాలో ఉంచారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిందే : 63వ డివిజన్ రాజీవ్ నగర్‌కు చెందిన 976 మంది ఓట్లను 61వ డివిజన్, పాయకాపురంలోని బూత్‌లో చేర్చారు. 59వ డివిజన్ లెనిన్ సెంటరులో 432 ఓట్లను 62వ డివిజన్‌లోని రాధానగర్ ప్రాంతం బూత్ జాబితాలో చూపారు. వీరంతా 2 కిలోమీటర్లకి పైగా దూరం వెళ్లి ఓటేయాల్సిన పరిస్థితి. స్థానికంగా పోలింగ్ బూత్‌లున్నా వీరి ఓట్లను దూరంగా ఉన్న బూత్‌ల్లో ఎందుకు చేర్చారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఓట్లు గల్లంతు : 58వ డివిజన్ వైఎస్సార్ కాలనీలో అద్దె ఇంట్లో ఉండే సుబ్బారావు, నాగమణి దంపతులు గత సంవత్సరం నవంబరులో సమీపంలోని 59వ డివిజన్‌లో వేరే ఇంటికి మారారు. ఓటు హక్కు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజా ఓటర్ల జాబితాలో వీరిద్దరి ఓట్లూ లేవు. చాలా డివిజన్లలో వందలాది ఓట్లను ఇలాగే సరైన కారణం లేకుండానే బీఎల్ఓలు తొలగించేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.