Essential Commodities Prices Rise in AP: ఇటీవల పెరిగిన టమోటా ధరలను చూసి సామాన్యులకు నోటమాట రాలేదు. అదేబాటలో కందిపప్పు, బియ్యం, వంట నూనె, పాలు నిత్యావసరాల ధరలు చూసి హడలిపోతున్నారు. ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వలసలు వెళ్లిన వేతన జీవులు అద్దెల భారం, పన్నుల మోతతో బతుకెళ్లదీయలేక అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు విజయవాడ వాసులు.
పప్పు ధాన్యాల నుంచి ఉప్పు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విద్యుత్ సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న మోతపై సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ జీవనం రోజురోజుకి భారంగా మారిపోతుంది. గ్రామాల్లో ఎటువంటి పనులు లేక నగరాలకు ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని వలసజీవులు, పేదలు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల వ్యవధిలోనే సరకుల ధరలు 20 నుంచి 30శాతం పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
నేటి నుంచి రాష్ట్రంలో పెరగనున్న పెట్రోల్,డీజిల్ ధరలు
పిల్లల చదువులు, కుటుంబ పోషణ, అనారోగ్య సమస్యలతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నిత్యావసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, అద్దెల భారంతో కుటుంబ పోషణ కష్టమవుతోందని మహిళలు వాపోతున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రభుత్వాల నియంత్రణ ఉండాలని సామాన్యులు కోరుతున్నారు.
రోజువారీ కూలీ చేసుకునే వారికి చేతి నిండా పనులు దొరకడం లేదు. దీనికితోడు నిత్యావసరాల ధరలు రోజుల వ్యవధిలోనే పెరిగిపోతున్నాయి. దీంతో కుటుంబాన్ని నెట్టుకురావటం సామాన్యులకు సవాల్‌గా మారింది. కూలీ పనులు, ఇతర చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారికి జీతాలు పెరిగేందుకు సంవత్సరాలు పడుతుంటే ఉప్పు, పప్పు, వంటనూనె ధరలు రోజుల వ్యవధిలోనే విపరీతంగా పెరుగుతున్నాయి.
రేషన్ షాపుల్లో బియ్యం సంగతి సరే.. సరకుల్లో కోత.. ధరల పెంపు.. అవి కూడా అరకొరే
దీంతో తాము ఏం తిని బతకాలని సామాన్యులు వాపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తున్నా కుటుంబపోషణ కష్టతరంగా ఉంటోందని మధ్యతరగతి ప్రజలు చెబుతున్నారు. నిత్యావసర ధరల పెరుగుదలపై నియంత్రణ విధించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
"పప్పు ధాన్యాల నుంచి ఉప్పు, కూరగాయల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వీటికి తోడు విద్యుత్ సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో వైసీపీ సర్కారు మోత మోగిస్తోంది. దీంతో మాకు జీవనం మరింత భారంగా మారుతోంది. రోజుల వ్యవధిలోనే సరకుల ధరలు 20 నుంచి 30 శాతం పెరుగుతున్నాయి. పిల్లల చదువులు, కుటుంబ పోషణ, అనారోగ్య సమస్యలతో తీవ్ర అవస్థలు పడుతున్నాం. భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తున్నా జీవనం సాఫీగా సాగడం లేదు. నిత్యావసర ధరల పెరుగుదలపై నియంత్రణ విధించడంలో ప్రభుత్వం విఫలమైంది." - స్థానికులు
Price Rise of Essential Commodities: భగ్గుమంటున్న నిత్యావసర ధరలు.. బెంబేలెత్తిపోతున్న ప్రజలు