Employees Protest Against Approval of GPS Bill: జీపీఎస్(GPS) చీకటి స్కీమ్ అని ఏపీ సచివాలయ సీపీఎస్(CPS) అసోసియేషన్ మండిపడింది. సీపీఎస్ రద్దు చేస్తామని రాష్ట్రంలో ఉన్న 3.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు మాటిచ్చిన జగన్ జీపీఎస్ అమల్లోకి తేవడాన్ని తీవ్రంగా ఖండించింది. సీపీఎస్ కంటే ప్రమాదకరమైన జీపీఎస్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా నల్ల చట్టమంటూ జీపీఎస్ బిల్లును చించివేసి నిరసన వ్యక్తం చేశారు.
శాసనసభలో గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ బిల్లు ఆమోదాన్ని వ‌్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు రోడ్డెక్కారు. జీపీఎస్ బిల్లు ఆమోదం ఉద్యోగులకు చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీటీఎఫ్(APTF) ఆధ్వర్యాన విజయవాడ లెనిన్ కూడలిలో నిరసన తెలిపారు. బిల్లు ప్రతులను దహనం చేశారు. ఇప్పటివరకు సీపీఎస్ రద్దు కోసం పోరాడమని ఇకపై జీపీఎస్ రద్దు కోసం గళమెత్తుతామని ఉద్యోగ నేతలు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఓపీఎస్ తెస్తామన్న హామీపై నాలుగేళ్ల తర్వాత మాట మార్చిన జగన్ జీపీఎస్ తీసుకొచ్చారని మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా జీపీఎస్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం సరికాదని ఉపాధ్యాయులు మండిపడ్డారు. గ్యారెంటీ లేని పెన్షన్ స్కీంకు గ్యారంటీ పెన్షన్ అని పేరు పెట్టడం ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులను మోసం చేయటమేనన్నారు. శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలిలో నిర్వహించిన ధర్నాలో జీపీఎస్ బిల్లులు ప్రతులను ఉపాధ్యాయులు దగ్ధం చేశారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. జీపీఎస్ వద్దని పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు.
Prepare GPS Proposed Ordinance as Alternative to CPS: జీపీఎస్‌లో పెన్షన్‌కు గ్యారంటీ లేనట్టేనా ?
శాసనసభ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం జీపీఎస్‌ను ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని వైయస్సార్ సర్కిల్ నందు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) నాయకులు జీపీఎస్ జీవో ప్రతులను మంటల్లో కాల్చి నిరసన వ్యక్తం చేశారు. జీపీఎస్ వద్దు, ఓపిఎస్ ముద్దు.. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం యుటిఎఫ్ గౌరవ అధ్యక్షుడు బూతన్న మాట్లాడుతూ అసెంబ్లీలో జీపీఎస్ అమలు ఆమోదంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పక్షాలకు నేడు చీకటి దినంగా చరిత్రపుటలో లిఖించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీపీఎస్ అమలు లక్షలాది ఉద్యోగ కుటుంబాలకు మరణశాసనంగ మారిందంటూ మండిపడ్డారు. జీపీఎస్ చట్టంలో అసంపూర్ణమైన, మోసపూరితమైన అంశాలు చేర్పించారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీపీఎస్‌ని రద్దుచేసి ఓపిఎస్ను అమలు చేయాలి. లేకపోతే రాబోవు రోజుల్లో అన్ని పక్షాలు ఏకమై జీపీఎస్‌పై ఐక్య పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు.