Drinking Water Problem: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వాసులు తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. కూతవేటు దూరంలో కృష్ణమ్మ ప్రవహిస్తున్నా వీరి తాగునీటి కష్టాలు మాత్రం తీరడం లేదు. సొంతంగా బోర్లు వేసుకున్నా ఉప్పునీరు పడుతోంది. 'రక్షిత నీటి సరఫరా పథకం' పునరుద్ధరణ కోసం ఏడు మాసాల కిందట వేసిన శంకుస్థాపన శిలాఫలకం మొక్కుబడిగా మిగిలింది.
విజయవాడ శివారు గొల్లపల్లి పంచాయతీలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇక్కడ 82వేల మంది జనాభా ఉండగా 36వేల మందికి మాత్రమే 'రక్షితనీటి పథకం' ద్వారా తాగునీరు అందుతుంది. మిగతా ప్రాంతాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గొల్లపూడి శివారు ప్రాంతాలు, కాలనీల్లో కనీస సదుపాయాలు కొరవడ్డాయి. ప్రధానంగా తాగునీటికి స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్యపై పంచాయతీ పాలకుల్ని ఎప్పుడు ప్రశ్నించినా నీటి సామర్థ్యం సరిపోవడం లేదని చెబుతున్నారని స్థానికులు అంటున్నారు.
తాగునీటి కోసం చందాలు వేసుకున్న ప్రజలు - గ్రామంవైపు కన్నెత్తి చూడని అధికారులు
వస్త్రలత కాలనీ, ఎస్.ఎస్.ఎస్. కాలనీ, మౌలా నగర్, శ్రీనివాస కాలనీ, వెంకయ్యస్వామి గుడి ఏరియా, సాయిపురం కాలనీ వాసులు తాగునీటికి కటకటలాడుతున్నారు. పాత రక్షితనీటి పథకాన్ని విస్తరించకపోవడంతో శివారు కాలనీలకు నీరందడం లేదు. పంచాయతీ నుంచి తాగునీరు రాక సొంత డబ్బులతో బోర్లు వేసుకున్నా ఉప్పునీరు వస్తుడటంతో ప్రయోజనం లేకుండా పోయింది. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల చర్మరోగాల బారిన పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి ఎద్దడి తీవ్రత దృష్ట్యా 'రక్షిత నీటి సరఫరా' పథకం పునరుద్ధరణతో పాటు ఇంటింటికి కుళాయి ఏర్పాటు లక్ష్యంగా గతేడాది మే 31న 730 లక్షల రూపాయల జలజీవన్ మిషన్ నిధులతో శంకుస్థాపన చేశారు. 7 నెలలు గడిచినా పనులు సెంటీమీటర్ కూడా ముందుకు కదల్లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకుని తాగునీటి ఎద్దడి నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో నిలిచిన తాగునీటి సరఫరా - స్థానికులతో కలిసి మేయర్ భర్త నిరసన
"తాగునీటి సమస్యలతో మేమంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. కూతవేటు దూరంలో కృష్ణమ్మ ప్రవహిస్తున్నా మా తాగునీటి కష్టాలు మాత్రం తీరడం లేదు. రక్షిత నీటి సరఫరా పథకం పునరుద్ధరణ కోసం ఏడు మాసాల కిందట వేసిన శంకుస్థాపన శిలాఫలకం మొక్కుబడిగా మిగిలింది. పంచాయతీ నుంచి తాగునీరు రాక సొంత డబ్బులతో బోర్లు వేసుకున్నా ఉప్పునీరు వస్తుంది. ఈ నీరు స్నానానికి కూడా పనికిరావట్లేదు. వీటిని స్నానానికి వినియోగిస్తే చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. తాగునీటి సమస్యపై పంచాయతీ పాలకుల్ని ఎప్పుడు ప్రశ్నించినా నీటి సామర్థ్యం సరిపోవడం లేదని చెబుతున్నారు." - నీటి ఎద్దడిపై స్థానికుల ఆవేదన