Devadaya sakha minister Kottu Satyanarayana: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కొలిక్కి వచ్చినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ప్రతి మంగళవారం దేవాదాయశాఖలో నిర్వహించిన సమీక్షల్లో భాగంగా దుర్గగుడి మాస్టర్‌ప్లాన్‌పై చర్చించారు. ప్రసాదం పోటు కోసం బహుళ అంతస్తు భవనం, అన్నదానం కోసం ప్రత్యేక భవనం, భక్తుల క్యూలన్ల కోసం కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఘాట్ రోడ్లో తాత్కాలిక వరుసలు కాకుండా కనకదుర్గా నగర్ నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణం చేయబోతున్నామన్నారు.
కనకదుర్గానగర్ నుంచి రాజగోపురం వరుకు మెట్లను రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. భక్తులు సేద తీరడానికి మల్టీలెవల్ భవనంపై ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉండేలా చూస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రసాదం పోటు తరహాలోనే దుర్గగుడిలో కూడా అగ్నేయ దిశలో ప్రసాదం పోటు భవనం ఏర్పాటవుతుందన్నారు. వీవీఐపీ లాంజ్, లిఫ్ట్స్ కూడా పెట్టబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన ఆలయాల్లో రకరకాల మాస్టర్ ప్లాన్స్‌తో నిర్మాణాలు చేపట్టబోతున్నామని కొట్టు సత్యనారాయణ తెలిపారు.