Crops Damaged with Michaung Cyclone Effect: మిగ్‌జాం తుపాన్ సృష్టించిన బీభత్సం నుంచి రైతులు ఇప్పుడే తేరుకునేలా కనిపించడం లేదు. వర్షం తగ్గుముఖం పట్టడంతో మునిగిపోయిన పంటపొలాలను చూసి రైతులు బోరున విలపిస్తున్నారు. మోకాలి లోతు నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు మార్గం లేకపోవటంతో అన్నదాతలు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇప్పటికే మొలకెత్తుతున్న తడిచిన ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మిగ్‌జాం తుపాన్ రైతులకు గుండెకోత మిగిల్చింది. చేతికొచ్చిన వరి, వాణిజ్య, ఉద్యాన పంటలు పూర్తిగా నష్టపోయాయి. ఆరబెట్టిన ధాన్యం చేతికొచ్చేలా కనిపించడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. వరి పైరు నేలకొరగగా ఇప్పటికే కోతలు పూర్తి చేసిన పొలాల్లో నీరు నిలిచిపోవడంతో వరి పనలు వరద నీటిలో తేలియాడుతున్నాయి.
అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు - వాగు దాటుతూ ముగ్గురు గల్లంతు
గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ గ్రామీణ మండలాల్లో పదిశాతం పంట కూడా చేతికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. డ్రెయిన్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతో పొలాల్లో చేరిన వరద నీరు బయటకు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ పంట నష్టం అంచనా వేసేందుకు రాలేదన్నారు. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం చేయడంతో రాశులన్నీ నీట మునిగాయి. వరితో పాటు అరటి, పసుపు వంటి పంటలకు నష్టం వాటిల్లింది.
గుంటూరు జిల్లాలో పంటపొలాలు నీటిలోనే తేలియాడుతున్నాయి. మిరప, పొగాకు, శనగ, మినుము పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆదుకోకుంటే అన్నదాతలకు ఆత్మహత్యలే శరణ్యమని కన్నీరు పెట్టుకుంటున్నారు. పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. పొన్నూరు మండలంలో నీటిపాలైన వరిధాన్యం మొలకెత్తుతోంది. డెల్టా ప్రాంతంలో పంట పొలాల్లో మోకాలు లోతు వరకు నిలిచిన నీటిని బయటకు తోడటం రైతులకు కత్తిమీద సాములా మారింది.
మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్ - పంట పొలాల్లో నిలిచిన వరద నీరు- రైతుల కళ్లలో కన్నీరు
తడిచిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులు నానా తంటాలుపడుతున్నారు. పల్నాడు జిల్లాలో ఓగేరు, కుప్ప గంజి, నక్క వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈదురు గాలులతో భారీ వర్షం రావడంతో మిర్చి, పత్తి, వరి, శనగ, మొక్కజొన్న, జూట్, కంది, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. అద్దంకి నియోజకవర్గంలో ఉద్యాన పంటలు నేలకొరిగాయి. మిర్చి, పొగాకు పంటలను మిగ్‌జాం తుపాన్ దెబ్బతీసింది.
ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పొగాకు పంట పూర్తిగా నేలకొరిగింది. నెల్లూరు జిల్లాలో మిగ్‌జాం తుపాన్ రైతులను నిండా ముంచింది. చేతి కొచ్చిన పంట నేల కొరగడంతో అన్నదాతలు కన్నీటి పర్వంతమవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.
పాఠశాలలో వరదనీరు - ఇబ్బంది పడుతున్న విద్యార్థులు