CM Jagan Review on Panchayat Raj and Rural Development: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేేశంలో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించిన జగన్.. అధికారులకు ముఖ్యమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ, స్త్రీ నిథి కింద ఇచ్చే రుణాలపై వడ్డీల విషయంలో 9 శాతానికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై అధికారులు నిరంతరం సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఆ కార్యక్రమాల పని తీరుపై మదింపు చేసేందుకు శాఖలలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి.. వారిని నడిపించడం చాలా ముఖ్యమన్న జగన్.. ఆగస్టు 10వ తేదీన మహిళలకు సున్నా వడ్డీ నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అనంతరం గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీల నిర్మాణాల పనులపై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణం దాదాపుగా కొలిక్కి వచ్చాయని.. సెప్టెంబరు నాటికి సుమారుగా అన్నింటినీ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. దాంతో మిగిలిన ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ క్లినిక్స్ నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.
సమీక్షలో జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాల కింద గ్రామాల్లో చేపట్టిన సర్వేపై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. 10,943 గ్రామాల్లో ఇప్పటికే డ్రోన్స్ సర్వే పూర్తి అయిందని అధికారులు సీఎంకు తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత ఆయా గ్రామాల్లో భూ హక్కు పత్రాలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేయర్‌ను నియమించడం వల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోందని, గ్రామ సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం జగనన్న కాలనీలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.. మౌలిక సదుపాయాలు దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. జగనన్న కాలనీలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులతో మాట్లాడుతూ..''లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాము. మౌలిక సదుపాయాలు విషయంలో రాజీ పడొద్దు. అపరిశుభ్రతకు ఈ కాలనీలను నిలయంగా మారకూడదు. అందుకనే కాలనీలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. వైఎస్‌ఆర్ చేయూత కింద అందిస్తోన్న డబ్బును మహిళల ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయడానికి, స్వయం ఉపాధి కల్పనకు వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోండి. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి.. ఆ డబ్బును చేయూత డబ్బుతో జోడించి, వారిలో స్వయం ఉపాధి పెంపొందించే మార్గాలపై దృష్టి పెట్టండి. ఇది కేవలం అధికారుల సమగ్ర పర్యవేక్షణ ద్వారానే సమర్థవంతంగా అమలవుతుంది'' అని జగన్ అన్నారు.
చివరగా.. మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీలను తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎస్‌ఎల్బీసీ సమావేశంలో ఇదే అంశంపై పలుమార్లు బ్యాంకులపై ఒత్తిడి తీసుకు వచ్చి స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణాలపై వడ్డీ మేజర్ పార్ట్ 9 శాతం వరకూ తగ్గించగలిగామని సీఎం తెలిపారు. ఇప్పుడు స్త్రీ నిధి కింద ఇచ్చే రుణాలపై వడ్డీలనూ 9 శాతానికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల తరపున అధికారులే గట్టిగా మాట్లాడాలని సీఎం సూచించారు.