Chandrababu Naidu Review Meeting: నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో వరుస సమీక్ష నిర్వహిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం, మంగళగిరి సహా 111 నియోజకవర్గాల్లో పరిస్థితిని ఇప్పటి వరకు పరిశీలించారు. తాజా సర్వేల ఆధారంగా మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని లోకేశ్‌తో చర్చించారు. 1983 - 85 ఎన్నికల్లో మాత్రమే మంగళగిరిలో తెదేపా గెలిచిందన్నారు. 1989 నుంచి 2009 వరకు జరిగిన 5 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. 2 దశాబ్దాల పాటు వేరే పార్టీలకు సీటు ఇవ్వాల్సి వచ్చినందున నియోజకవర్గంలో అప్పట్లో పార్టీ బలోపేతం కాలేదని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత పార్టీ కార్యాచరణ పెంచడం, కార్యకర్తల సంక్షేమం చూడడం వల్ల నియోజకవర్గంలో మంచి మార్పు కనిపిస్తోందన్నారు. తాను ఓడిపోయినా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువవ్వగలిగానని లోకేశ్ అధినేతకు వివరించారు.
తెదేపా అందించే సహకారమే కాక తాను సొంతంగా 12కు పైగా సంక్షేమ కార్యక్రమాలు అందించడం ద్వారా అన్ని వర్గాల ప్రజల మనసులు గెలుచుకున్నానని వివరించారు. గత ఎన్నికల్లో ఓటమిని పట్టించుకోకుండా ఈసారి మంగళగిరి సీటును అత్యధిక మెజారిటీతో గెలిచి చరిత్రని తిరగరాయాలని లోకేశ్‌కు చంద్రబాబు సూచించారు. గెలుపు గ్యారంటీ అని అలసత్వం వహించకుండా.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తిరుగులేని విజయం సాధించేలా ఉండాలని స్పష్టం చేశారు.
అభివృద్ధి మాత్రమే తెలిసిన కుప్పం ప్రజలకు వైకాపా అరాచక రాజకీయం కొత్తగా ఉందని చంద్రబాబు అన్నారు. కుప్పంను తొలి నుంచి ఒక మోడల్ నియోజకవర్గంగా చేశామని.. హింసను, విద్వేష రాజకీయాలను అక్కడి ప్రజలు అనుమతించరని స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు నిర్వహణ, ఓటర్ జాబితా పరిశీలన సహా పార్టీ కార్యక్రమాలపై అధినేత సమీక్షించారు. రాష్ట్రంలో ఒకే సింబల్ పై అన్ని సార్లూ గెలిచిన నియోజకవర్గాలు కుప్పం, హిందూపురం మాత్రమేనని చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పంలో కేసులు, దాడులు, కుల విద్వేషాలతో నేతలను, కార్యకర్తలను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని.. దీన్ని స్థానిక నాయకత్వం సమర్థంగా తిప్పి కొట్టాలని సూచించారు.
అధికారులతో అరాచకాలు చేస్తున్న వైకాపా నేతల లెక్కలు సరిచేస్తానని చంద్రబాబు హెచ్చరించారు. స్థానికంగా ఎదురవుతున్న పరిణామాలను నేతలు అధినేత దృష్టికి తెచ్చారు. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడకుండా ఐక్యంగా పోరాడుతున్నామని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి జనాన్ని తెచ్చినా.. కుప్పంలో సీఎం సభ సక్సెస్ కాలేదన్నారు. దీనికి స్థానికంగా వచ్చిన వ్యతిరేకతే కారణమని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టని ముఖ్యమంత్రి తన సభకు కోట్లు వెచ్చించారని తెలిపారు. గుడిపల్లి మండలంలో 230 మంది వైకాపా కార్యకర్తలకు నిబంధనలకు విరుద్ధంగా డీకేటీ పట్టాలు ఇప్పించే పని మొదలైందని తెలిపారు.
ఇక కుప్పం రెస్కో సంస్థలో అక్రమంగా నియామకాలు జరుగుతున్నాయని వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తెచ్చి వైకాపా నేతలు అమ్ముతున్నారని విమర్శించారు. హంద్రీనీవా పనులపై ప్రకటనలు తప్ప పని జరగడం లేదన్నారు. ఈ అంశాలపై స్థానిక నాయకత్వం పోరాడాలని నేతలకు చంద్రబాబు సూచించారు. కర్నూలు ఇన్‌ఛార్జ్ టీజీ భరత్, ఇచ్ఛాపురం ఇన్‌ఛార్జ్ బెందాళం అశోక్‌లతోనూ చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నేడు మరో నాలుగైదు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశంకానున్నారు.
ఇవీ చదవండి: