Central Team Drought Affected Areas Inspection: ఎన్టీఆర్ జిల్లాలో కరవు మండలాల స్థితిగతులను అధ్యయనం చేయడానికి గురువారం కేంద్ర బృందం చేపట్టిన పర్యటన కేవలం గంటన్నర వ్యవధిలోనే ముగిసింది. పొద్దుపోయిన తర్వాత వచ్చిన కేంద్ర బృందం పంట నష్టాన్ని పూర్తిగా చూడకుండానే వెళ్లిపోయిందంటూ అన్నదాతలు పెదవి విరిచారు.
రైతు సంక్షేమ విభాగం సహాయ కార్యదర్శి పంకజ్ యాదవ్ ఆధ్వర్యంలో కేంద్ర బృంద సభ్యులు డాక్టర్ కె.పొన్నుస్వామి, కైలాష్ శుక్లా, మహేష్‌కుమార్ మధ్యాహ్నం 1.50 గంటలకు విజయవాడకు వచ్చారు. కలెక్టర్ డిల్లీరావు, జేసీ సంపత్‌కుమార్ కేంద్ర బృంద సభ్యులకు స్వాగతం పలికారు. తిరువూరు మండలం లక్ష్మీపురానికి మధ్యాహ్నం 2.30 గంటలకు రావాల్సిన కేంద్ర బృందం 5.15 గంటలకు వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రైతులు కేంద్ర బృంద సభ్యులు ఎప్పుడెప్పుడు వస్తారా అంటూ వారి కోసం పడిగాపులు కాశారు.
తీరిగ్గా వచ్చిన బృందం సభ్యులు గ్రామానికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రం వద్ద కరవు పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. సమీపంలో సాగు చేసిన పత్తి పంటను చీకటిగా ఉన్నప్పుడే పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా తవ్వించిన నీటి కుంటను పరిశీలించిన బృందం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సాగునీటి ఎద్దడితో పంటలకు వాటిల్లిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.
న్యాయం చేయండి - కేంద్ర బృందాన్ని కోరిన రైతులు
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరవు ఏర్పడి పంటలను కోల్పోయామని, ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రైతులు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. కరవు నేపథ్యంలో ఏర్పడిన పంట నష్టానికి తగిన ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలను సమర్పించనున్నట్లు పంకజ్ యాదవ్ వెల్లడించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 50 అదనపు పని దినాలను కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి నీటి లభ్యత లేకపోవడం, వర్షాలు లేకపోవడం, మైనర్ ఇరిగేషన్ వ్యవస్థలు, చెరువుల ద్వారా సాగునీరు లభించకపోవడం తదితరాల కారణంగా తిరువూరు, గంపలగూడెం మండలాల రైతులు ఖరీఫ్‌లో పంటలను బాగా నష్టపోయారని జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ వెల్లడించారు. అక్టోబర్ నుంచి వర్షాలు సరిగా లేనందున కరువు మండలాల ప్రకటనకు సంబంధించి వివిధ మండలాలకు జరిగిన నష్టాలపై ప్రతిపాదనలు పంపించామని వివరించారు.
అయితే సభావేదిక వద్ద విద్యుద్దీపాలు సరిగా వెలగకపోవడంతో పలువురు రైతులు తమ ఆవేదనను చెప్పకుండానే వెనుదిరిగారు. బృందంలోని మరో ముగ్గురు సభ్యులు రెండో టీమ్‌గా విడిపోయి ఎర్రమాడు, గంపలగూడెం మండలం గుళ్లపూడిలో పర్యటించారు. అక్కడ సైతం చీకటి పడటంతో సెల్‌ఫోన్ల వెలుగులోనే పంటలను మొక్కుబడి తంతుగా పరిశీలించారు. సాయంత్రం 5.15 గంటలకు వచ్చిన కేంద్ర బృందం 6.40 గంటలకు తిరిగి విజయవాడ బయల్దేరి వెళ్లింది. ఇందులో కేవలం గంట సమయం మాత్రమే రైతులకు కేటాయించడం బాధాకరం.
కేెంద్ర కరవు బృందాన్ని అడ్డుకున్న రైతులు - తడిసిన పంటల ఫొటో ప్రదర్శన