BJP State President Purandeswari on Alliance: మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో పొత్తుల అంశం చర్చనీయాంశమైంది. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై తన అభిప్రాయాన్ని సూచన ప్రాయంగా తెలపగా.. ఈ విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ఎన్డీఏ సమావేశంలో తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన పాల్గొందని.. త్వరలో తాను కూడా జనసేన అధినేత పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తానని చెప్పారు. ఇప్పటికే వారితో ఫోన్‌లో మాట్లాడానని అన్నారు. అలాగే పొత్తుల అంశంపై సరైన సమయంలో తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
AP BJP Chief Purandeswari on AP Debts: రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న అనధికార అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. రిజర్వు బ్యాంకు నుంచి పొందుతున్న అధికారిక రుణాలను మాత్రమే చూపిస్తూ.. అనధికారిక రుణాల గురించి తెలియజేయకుండా చేస్తుండటం వల్లే కేంద్ర ప్రభుత్వం రుణాల కోసం సహకరిస్తుందనే భావనను ప్రజల్లో కలిగిస్తోందని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో 4 లక్షల 74 వేల 315 కోట్ల రూపాయల రుణాలను అనధికారికంగా పొందారని గణాంకాలతో సహా విజయవాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు.
రాష్ట్ర విభజన అనంతరం స్వర్ణాంధ్రగా.. నవ్యాంధ్ర ఎదగాలనే ఆంధ్రప్రదేశ్ కలను అంధకార, అవినీతి, అప్పుల ఆంధ్రగా మార్చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. రాష్ట్ర విభజన నాటికి 97 వేల కోట్ల రూపాయలు వరకు ఉన్న అప్పులను.. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలోనే 7.14 లక్షల కోట్ల మేర అప్పు చేసిందని తెలిపారు. అందులో రూ.4లక్షల కోట్లు అనధికారికంగా అప్పు తెచ్చారన్నారు.
రాష్ట్రానికి వస్తోన్న ఆదాయం 90 వేల కోట్ల రూపాయలు.. కేంద్ర ప్రభుత్వం టాక్స్ డివల్యూషన్ ద్వారా అందిస్తోందని.. 35 వేల కోట్ల రూపాయలు కలిపితే లక్షా 25 వేల కోట్ల రూపాయలుగా ఉంటోందని చెప్పారు. మొత్తం ఆదాయంలో 40 శాతం తీసుకున్న అప్పులకు వడ్డీల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఉందని.. ఇలాంటి అద్వాన్నమైన ఆర్ధిక స్థితిలో రాష్ట్రం ఉంటే.. రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఎలా నడగలరని పురందేశ్వరి ప్రశ్నించారు.
ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి, గుత్తేదారులకు బిల్లులు ఇవ్వడానికి కూడా రుణాలు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. గ్రామ పంచాయతీల నిధులతో పాటు ఉద్యోగులు దాచుకున్న మొత్తాలను దారి మళ్లించారని.. కార్పొరేషన్ల ద్వారా వాటి అవసరాలకు కాకుండా ఇతర వాటికి అప్పులు చేసి నిధులు మళ్లించారని.. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని విమర్శించారు. కేవలం తమ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడానికి రాష్ట్రాభివృద్ధిని, మౌలిక వసతుల మెరుగుదలను, ఉపాధి అవకాశాలను, పారిశ్రామిక పెట్టుబడులను ఘోరంగా దెబ్బ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నింటినీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.